న‌మ్మండి... ఇవ‌న్నీ నిజాలే

Update: 2015-10-15 17:22 GMT
చాలా కాలం క్రితం వ‌చ్చిన హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా గుర్తుందా? అచ్చు త‌న పోలిక‌ల‌తోనే ఉన్న సోద‌రుడిని ఆ హీరో క‌లుసుకోవ‌డం ఒక చిత్ర‌మైన అనుభూతి. అలాంటి అనుభూతి కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం అవుతుందేమో అనుకుంటున్న టైమ్‌లో స‌రిగ్గా అలాంటి ఎపిసోడ్ ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఆ బంధం కూడా దాదాపు నాలుగు ద‌శాబ్దాల త‌ర్వాత క‌లుసుకున్న‌ది కావ‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ అమెరికాలో జ‌రిగిన ఆ క‌థాక‌మామిషు ఏంటంటే..

అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని లిమా నగరంలో నివసించే జేమ్స్‌ను ఓ కుటుంబం ద‌త్త‌త తీసుకుంది. అయితే ద‌త్త‌త వ‌చ్చిన జేమ్స్‌కు ఓ కొత్త ఆస‌క్తి పుట్టింది. అస‌లు త‌నెవ‌రు? త‌న సొంత వాళ్లెవ‌రు? అనే ఆస‌క్తి క‌లిగింది. ద‌త్త‌త తీసుకున్న‌ తల్లిదండ్రులను అడిగితే వాళ్లు స‌గం వివ‌రాలే చెప్పారు. జేమ్స్‌కు ఓ కవల సోదరుడు ఉండేవాడని చిన్నతనంలోనే జేమ్స్‌ను వీరు ద‌త్త‌త తీసుకోగా...అత‌ని సోదరుడిని వేరే కుటుంబం దత్తత తీసుకుందని అస్ప‌ష్టంగా చెప్పారు. క‌వ‌లలు అయిన‌ప్ప‌టికీ అలా క‌లుసుకోకుండా ఉన్న ఆ 'హలో బ్రదర్' ని కలుసుకోవాలని జేమ్స్‌లో కోరిక పుట్టింది. దీంతో ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన జేమ్స్ దొరికిన వివ‌రాల‌న్నీ సేక‌రించ‌గా...దాదాపు 40 మైళ్ల దూరంలోని ఓ పట్టణంలో సోద‌రుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. అలా 39 ఏళ్ల వయసులో వారిద్ద‌రూ కలుసుకున్నారు.

అయితే అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వారు క‌లుసుకున్న స‌మ‌యంలో వెలుగులోకి వ‌చ్చాయి. వీరిద్దరికీ పెంపుడు తల్లిదండ్రులు జేమ్స్ అనే పేర్లు పెట్టారు. ఎదుగుతున్న క్ర‌మంలోనూ  వీరిద్దరూ ఒకే త‌ర‌హా ఆలోచ‌న‌తో ముందుకువెళ్లారు. లెక్కలు బాగా చేయ‌డం, స్పెల్లింగులు చెప్ప‌డం అంటే ఇష్ట‌ప‌డ‌కపోవ‌డం, పెయింటింగ్‌లో సూప‌ర్బ్ టాలెంట్ ఉండ‌టం వంటివి కామ‌న్‌ గా సాగాయి. ఇంతేకాదు లిండా అనే పేరున్న అమ్మాయిలనే ఈ కవలలు పెళ్లి చేసుకోగా...ఇద్దరి వైవాహిక జీవితాలూ విఫలమయ్యాయి. తర్వాత బెట్టీ అనే పేరున్న మహిళలనే వీరు పెళ్లాడారు. ఈ కవల సోదరులకి ఏకైక‌ కుమారుడే సంతానం. యాదృచ్ఛికంగా వీరి పేర్లు 'జేమ్స్ అలాన్' ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే.. ఈ విచిత్ర సోదరులు పెంచుకున్న పెంపుడు కుక్క పేరు కూడా టాయ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదే ఇంట్రెస్టింగ్ అనుకుటే....జ‌ర్మ‌నీలో మ‌రో ట్విస్టింగ్ ఎపీసోడ్ ఒక‌టి జ‌రిగింది. రెండేళ్ల త‌ర్వాత దిగిన ఓ ఫొటోలో ఇద్ద‌రి చిత్రాలు ఉండ‌టం, వాళ్లిద్ద‌రూ ఒకే మ‌హిళ‌ సంతానం కావ‌డం గొప్ప ట్విస్ట్‌.  ఇప్పటిలాగా ఫొటో తీసిన వెంటనే ప్రింట్ ఇచ్చే సౌల‌భ్యం లేని 1914 తాలుకు ముచ్చ‌ట ఇది. జర్మన్‌లోని ఓ మహిళ స్ట్రాస్‌ బర్గ్ పట్టణంలోని ఫొటో స్టూడియోకు వెళ్లి తన కుమారుడిని ఫొటో తీసేందుకు ఫిల్మ్ ప్లేట్ ను కొనుగోలు చేసి త‌న‌ పసివాడిని కెమెరాతో ఫొటో దింపించింది. డెవలప్ చేసి వెంట‌నే ఇచ్చేసే సౌకర్యం ఆ రోజుల్లో లేకపోవడంతో కొద్ది రోజుల తర్వాత వచ్చి ఫొటోలు తీసుకువెళ్లమ‌ని స్టూడియో వారు చెప్ప‌డంతో ఆమె స‌రే అంది. అయితే అపుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది. దీంతో మళ్లీ స్టూడియోకు వెళ్లలేదు. ఓ రెండేళ్లు గ‌డిచిన త‌ర్వాత ఆమె స్ట్రాస్‌ బర్గ్‌ను విడిచిపెట్టి, ఫ్రాంక్‌ ఫర్ట్ నగరానికి మకాం మార్చింది. మరో చిన్నారికి తల్లి కూడా అయ్యింది. అయితే త‌న‌ కుమారుడు, కుమార్తెకు చెందిన ఒక్క ఫొటో కూడా లేకపోవడంతో ఆమె స్థానిక ఫొటో స్టూడియోకు వెళ్లింది. ఈసారి మరో ఫిల్మ్ ప్లేట్ ను కొనుగోలు చేసి, తన కుమార్తెను ఫొటో తీయాలంటూ కోరింది.

అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్‌.  ఫొటో దింపిన ఆ స్టూడియో వారు డెవలప్ చేసిన ఫొటోల్లో ఆమెకు కుమార్తెతో పాటు వెనకభాగంలో కుమారుడు కూడా కనిపించాడు!! దీంతో స్టూడియో నిర్వాహకులు స‌హా ఆమె కూడా ఆశ్చ‌ర్య‌పోయింది. స్ట్రాస్‌బర్గ్ స్టూడియోలో తప్ప వేరే ఎక్కడా త‌న కుమారుడిని ఫొటో దింప‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. ఎలా జ‌రిగింద‌ని ఆరాతీయ‌గా స్ట్రాస్‌ బర్గ్ స్టూడియో ఆ బాలుడిని చిత్రించిన ఫిల్మ్ ప్లేట్ ను ఫొటో కోసం డెవలప్ చేయలేదు. దీంతో ఆ ఫిల్మ్ ప్లేట్ ఎన్నో చేతులు మారి, చివరకు ఫ్రాంక్‌ ఫర్ట్ నగరానికి చేరింది. అక్కడ ఆ జర్మన్ మహిళ చేతికే చిక్కింది.అలా ఆమెకు కూతురు, కుమార్తె చిత్రాల‌ను జ్ఞాప‌కాల పుట‌ల్లో చేర్చింది.
Tags:    

Similar News