రెండు బిగ్ ఇష్యూస్.. ముందస్తు ఎన్నికలు.. జగన్ ఏం చేయబోతున్నారు...?

Update: 2022-12-13 06:06 GMT
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అంటే అదొక పెద్ద రాజకీయ చర్చగా మారుతోంది. ముందస్తు ఎన్నికలు అని తెలుగుదేశం పార్టీ అదే పనిగా ఏడాది నుంచి ఊదరగొడుతోంది. సహజంగా ప్రతిపక్ష పార్టీకి ఎన్నికలు అర్జంటుగా కావాలి. కానీ అధికారంలో ఉన్న వారు అయితే చివరి రోజును కూడా వదులుకోరు. ఇది ఎపుడూ రుజువు అవుతున్న విషయమే.

అలాంటిది ఎన్టీయార్ చంద్రబాబు చెరి ఆరు నెలలలను వదులుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి చేదు ఫలితాలను మూటకట్టుకున్నారు. అదే కేసీయార్ ఆరు నెలల ముందు ఎనంకలకు వెళ్ళి మరోసారి అధికారాన్ని తెలంగాణాలో నిలబెట్టుకున్నారు. ఇపుడు ఏపీ మీద అందరి దృష్టి ఉంది. జగన్ కూడా అయిదేళ్ళూ ప్రభుత్వాన్ని నడపలేడని మధ్యలో కాడె వదిలేస్తాడని పాలనలో విశేష అనుభవశాలి అయిన తెలుగుదేశం ఊహించింది.

కానీ జగన్ కరోనా వంటి పెను విపత్తులు ఉన్నా కూడా మూడున్నరేళ్ళ పాలన పూర్తి చేశారు. ఇక మిగిలింది ఏణ్ణర్ధం మాత్రమే. అయితే ఏడాది పదవీకాలాన్ని వదులుకుని జగన్ 2023 మేలో ఎన్నికలకు వెళ్తాడని అంతా అంటున్నారు. ఈ మధ్యనే బీజేపీకి చెందిన సత్యకుమార్ కూడా దీని మీద గట్టిగా మాట్లాడారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. దానికి తగినట్లుగా జగన్ దూకుడు పెంచడం, వరసబెట్టి ఎమ్మెల్యేలను మంత్రులను జనాల్లోకి పంపించడం వర్క్ షాప్స్ ని నిర్వహించడం వంటివి చూసిన వారు సైతం ముందస్తు కసరత్తు అనుకున్నారు.

కానీ జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లరని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024 షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు జరుగుతాయి అన్నారు. కావాలంటే దీన్ని రాసిపెట్టుకోండి అని ఆయన సవాల్ చేశారు. జగన్ని దగ్గరగా చూసిన మనిషిగా ఆయన ఆలోచనలు తెలిసిన వాడిగా తాను దమ్ముగా ఈ మాట చెబుతున్నాను అని  పేర్ని  నాని అన్నారు. ఏపీలో ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి  అని ఆయన స్పష్టం చేశారు.

అంతవరకూ జగన్ పాలన మీదనే దృష్టి పెడతారని, ఏపీలో పేదలకు సేవ చేయాలి. మేలు జరగాలని జగన్ కోరుకుంటారు. ఈ టెర్మ్ లో లాస్ట్ డే వరకూ జగన్ తపన కూడా అదే అని ఆయన అన్నారు. ఇక ఇదే విషయం మీద అప్పట్లో సీనియర్ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ముందస్తు ఉండదనే చెప్పారు. ప్రజలు వైసీపీని మెచ్చి 151 సీట్లు ఇచ్చారని, వారి తీర్పుని వమ్ము చేసి ముందస్తునకు వెళ్లడం చేయబోమని అన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

ఇక మరో మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే వచ్చే ఏడాది జూన్ నుంచి విశాఖ కేంద్రంగా జగన్ పాలన ప్రారంభిస్తారు అని చెబుతున్నారు. దాని భావం ఏంటి అంటే జగన్ 2024 ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మంత్రులు అంటున్నారు. అలాగే జగన్ కూడా ఆ మధ్య నెల్లూరు లో జరిగిన సభలో మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరి వరకూ తాము చేయాల్సిన పనులు ఉన్నాయని అన్నీ పూర్తి చేసుకునే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

మరో విషయం ఏంటి అంటే 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి అవుతుంది. ఆ విషయం కూడా కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ప్రకటించింది. అమరావతి పోలవరం అన్న ఈ రెండు బిగ్ ఇష్యూస్ తేలకుండా జగన్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు లేవనే అంటున్నారు. చంద్రబాబు జిల్లాల టూర్లలో ఈ విషయాలు హైలెట్ చేస్తున్నారు. దాంతో ఆయనకు ఆ చాన్స్ ఇవ్వకుండా వాటి విషయంలో ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకున్న తరువాతనే ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.

ఇక ఇంకో వైపు చూస్తే వచ్చే ఏడాది విశాఖ వేదికగా అనేక కార్యక్రమాలు చేయడానికి వైసీపీ సంకల్పించింది. ప్రతిష్టాత్మకమైన జీ 20 సదస్సు ఉంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఉంది. ఇలా ఇవన్నీ పూర్తి అయ్యేసరికి తొలి ఆరు నెలలూ గడచిపోతాయి. కాబట్టి పేర్ని నాని చెప్పినట్లుగా జగన్ ముందస్తు ఆలోచనల్లో లేరని భావించవచ్చు అంటున్నారు. కానీ రెండేళ్లకు ముందే పార్టీని జనంలోకి తీసుకువెళ్లాలి అన్న ఆలోచనల మేరకే జగన్ దూకుడు చేస్తున్నారని ఇందులో విపక్షాలు వేరేగా ఆలోచిస్తే తమ తప్పు లేదని పేర్ని నాని చెబుతున్నారు. సో జగన్ ఆలోచనల మేరకు చూస్తే లాస్ట్ రోజు దాకా అధికారంలో ఉండాలనే భావిస్తుననరుట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News