కర్ణాట‌క సంకీర్ణానికి మూడిన‌ట్లేనా?

Update: 2019-07-02 04:26 GMT
తాము టార్గెట్ చేసింది ఎట్టి ప‌రిస్థితుల్లో సొంతం చేసుకునే అల‌వాటున్న మోడీషాల‌కు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యేలా చేశాయి క‌న్న‌డ ప్ర‌జ‌ల తీర్పు. నోటి దాకా వ‌చ్చిన ముద్ద చేజారిపోతే ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా.. మోడీషాలు మాత్రం తెగ ఫీల‌వుతున్నారు. క‌న్న‌డ నేల‌పైన కాషాయ జెండాను ఎగురువేసే అవ‌కాశాన్ని జ‌స్ట్ మిస్ కావ‌టాన్ని జీర్ణించుకోలేని వారు.. అప్ప‌టి నుంచి ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌టం లేదు.

కుమార‌స్వామి సంకీర్ణ ప్ర‌భుత్వానికి ఏదోలా షాకిచ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు. వ‌ర్క్ వుట్ అవుతున్న‌ట్లే అవుతూ.. టార్గెట్ మిస్ అవుతూ.. త‌మ ల‌క్ష్యం అంత‌కంత‌కూ వాయిదా ప‌డుతున్న వైనం వారికి విసుగును క‌లిగిస్తోంది.

ఏదోలా కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేసి క‌మ‌ల‌నాథుల చేతికి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవ‌టానికి విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆ ప‌ని పూర్తి కాక‌పోవ‌టం వారిని నిరాశ‌కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో చోటుచేసుకున్న తాజా ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి అమెరికాలో ఉన్న వేళ‌.. సంకీర్ణ ప్ర‌భుత్వానికి షాకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తాజాగా త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్‌.. ర‌మేశ్ జార్కి హోళిలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. వీరిలో ఆనంద్ సింగ్ అయితే ఏకంగా స్పీక‌ర్ ను క‌లిసి త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. మ‌రో ఎమ్మెల్యే ర‌మేశ్ సైతం స్పీక‌ర్ ను క‌ల‌వ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. తాజా ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. వెంట‌నే అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించింది. మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య నివాసంలో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు.

జేఎస్ డ‌బ్ల్యూ కంపెనీకి బ‌ళ్లారి జిల్లాలో 3,667 ఎక‌రాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమ‌తుల్ని ర‌ద్దు చేయాల‌న్న త‌న డిమాండ్ ను ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌లేద‌ని.. ఒక‌వేళ త‌న డిమాండ్ల‌కు ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తే త‌న రాజీనామాను ఉప‌సంహ‌రించుకునే అంశాన్ని ప‌రిశీలిస్తాన‌ని చెప్పారు.

తాజాగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌టంలో కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన‌ట్లేన‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. క‌ర్ణాట‌క అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 77.. జేడీఎస్ కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి మ‌రో ముగ్గురు ఇండిపెండెంట్ల మ‌ద్ద‌తు ఉంది. మొత్తంగా అధికార పార్టీకి క‌ర్ణాట‌క అసెంబ్లీలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌టంతో వారి బ‌లం 115కు ప‌డిపోయింది.

తాజా ప‌రిణామంతో క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి 113 మంది ఎమ్మెల్యేలు ఉంటే స‌రిపోతుంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌రో తొమ్మిది మంది ఎమ్మెల్యేల్ని ఆక‌ర్షిస్తే.. మోడీషాలు తాము కోరుకున్న‌ది సొంతం కావ‌టం ఖాయం. మ‌రి.. ఆ దిశ‌గా అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు సిద్ధ‌మ‌వుతారా? అన్న‌దే ఇప్పుడున్న ప్ర‌శ్న‌. మోడీషాలు కోరుకోవాలే కానీ.. వారి కోరిక‌ను తీర్చ‌టానికి క‌న్న‌డ నేత‌లు సిద్ధంగా ఉండ‌రంటారా?


Tags:    

Similar News