తండ్రిని చంపేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్కాచెల్లెళ్లు

Update: 2016-05-14 10:04 GMT
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి తమను దారుణంగా, చెప్పుకోలేని రీతిలో బూతులు తిడుతుంటే ఆ అక్కాచెల్లెళ్లు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా తండ్రి పీడ వదిలించుకోవాలనుకున్నారు. తమను తండ్రి నిత్యం బూతులు తిడుతుండటంతో ఆయన్ను చంపేయాలని డిసైడయ్యారు.  ఇంకా టీనేజి వయసులోనే ఉన్న ఆ అక్కాచెల్లెళ్లు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు దాన్ని అమలు చేసేశారు కూడా. తండ్రిని సుత్తితో కొట్టి చంపేసిన తరువాత అక్కడితో ఆగకుండా ఆ ఘనకార్యాన్ని సోషల్ మీడియాలో వీడియో తీసి వివరించారు. దీంతో ఇది సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో కరణ్ సింగ్ అనే వ్యక్తి పచ్చి తాగుబోతు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు - అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. తాగిన మైకంలో ఇంటికొచ్చి నిత్యం భార్యాపిల్లలను తిట్టడం, కొట్టడం చేసేవాడు. దీంతో కూతుళ్లిద్దరూ తండ్రిని చంపేస్తే తప్ప తమ కష్టాలు తీరవని భావించి సుత్తితో కొట్టి చంపేశారు.  ఆ అమ్మాయిలు పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే... "మేం మా నాన్నను చంపేశాం.  బూతులు తిడుతూ - మమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించాడు. ఓ సుత్తి తీసుకుని అతని తలపై కొట్టి చంపేశాం.  అతను చస్తేనైనా మాకు సమస్యలు తగ్గుతాయని భావించాం" అని చెప్పారు. ఈ వీడియోలో రక్తంతో తడిసిన ఓ సుత్తి కూడా కనిపిస్తోంది. అయితే.. పోలీసులు మాత్రం ఆ అమ్మాయిలు చెబుతున్నది నమ్మడం లేదు. కరణ్ సింగ్ తలకు గాయం ఉన్నప్పటికి అది సుత్తితోకొట్టినది కాకపోవచ్చని అంటున్నారు. బావి గోడకు తల తగలడంతో గాయపడి చనిపోయాడని అంటున్నారు.

అయితే.. కరణ్ సింగ్ చనిపోగానే  భార్య తన ఐదేళ్ల కుమారుడిని తీసుకుని పారిపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. కరణ్ ను భార్య చంపి ఉంటుందని.. ఆ నేరాన్ని కూతుళ్లు తమపై వేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు కథ ఏంటో బయటపడుతుందని పోలీసులు అంటున్నారు. నేరాలు హత్యలు సాధారణమైపోయినప్పటికీ ఇలా హత్య చేసిన తరువాత ఇద్దరు అమ్మాయిలు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Tags:    

Similar News