పోలీస్ బాసులు తెలంగాణ‌కు వెళ్తామంటున్నారే!

Update: 2016-07-22 05:00 GMT
పోలీసు ఉన్న‌తాధికారులు అంటే ప్రాంతాల‌కు అతీతంగా సేవ‌లు అందిస్తూ ఉంటారు. కేంద్ర స‌ర్వీసులు కాబ‌ట్టి  భారత‌దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప‌నిచేస్తారు. వారికి ప్రాంతీయ భావోద్వేగాల‌తో ఏమాత్రం సంబంధం ఉండ‌దు. అది తెలంగాణ కావొచ్చు... ఆంధ్రా కావొచ్చు.. మ‌రో రాష్ట్రం కావొచ్చు! పోలీసు ఉన్నాధికారులు వారి ప‌ని వారు చేసుకుంటూ పోతుంటారు. ఒక‌రికి ఒక‌రు చేదోడువాదోడుగా స‌హ‌క‌రించుకుంటూ ఉంటారు. కానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోకి కొంత‌మంది పోలీసు ఉన్న‌తాధికారుల మ‌ధ్య ఇగో ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చి న‌ట్టు కొన్ని క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వారి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంద‌ని కూడా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ పోట్లాట‌లో ఇమ‌డ‌లేని కొంత‌మంది అధికారులు చాలా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు క‌థ‌నం! ఒక‌రికి అనుకూలంగా న‌డుచుకుంటే మ‌రో అధికారికి కోపం వ‌స్తుంది. ఎవ‌రినీ హ‌ర్ట్ చేయ‌కుండా ఉండాలంటే ఉద్యోగం చేయ‌డ‌మే ఇబ్బందిగా మారుతోంద‌ని కొంతమంది అధికారులు వాపోతున్న‌ట్టు చెప్పుకుంటారు. కొంద‌రైతే... మేం ఏపీలో ఉండ‌లేం, మ‌మ్మ‌ల్ని తెలంగాణ‌కు పంపించేయండీ అంటూ క్యాట్‌ను ఆశ్ర‌యించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తూ ఉండ‌టం విశేషం!

ఉన్న‌తాధికారుల ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం మ‌ధ్య‌లో ఇమ‌డ‌లేని 8 మంది ఐపీయ‌స్‌ లు త‌మ‌ని తెలంగాణ రాష్ట్రానికి బ‌దిలీ చేయండి అంటూ క్యాట్‌ ను కోర‌డానికి సిద్ధ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. వీరిలో ఇద్ద‌రు ఇప్ప‌టికే క్యాట్‌ కు త‌మ క‌ష్టాల‌ను విన్న‌వించుకున్నార‌ట‌. దీంతో స్పందించిన క్యాట్ కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు నోటీసులు కూడా పంపింద‌ని తెలుస్తోంది. వారిద్ద‌రూ ఎవ‌రంటే... అమిత్ గార్గ్‌ - హ‌రీష్ గుప్త‌. వీళ్ల‌ని ఆంధ్రా స‌ర్కారు రెండేళ్ల స‌ర్వీసు అయినా పూర్తి కాకుండా బ‌దిలీ చేసింద‌ని అంటున్నారు.

ఇంత‌కీ ఈ ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధానికి కార‌ణం ఎవ‌రంటే... ఒక అద‌న‌పు డీజీపీ అని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న తీరు వ‌ల్ల‌నే ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే డీజీపీ రాముడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. సో... దీంతో పరిస్థితి మ‌రింత గంద‌ర‌గోళంగా మారే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నార‌ట‌! ఈ త‌రుణంలో ఒక అద‌న‌పు డీజీపీ కావాల‌నే కొంత‌మంది ఉన్న‌తాధికారుల‌పై నిఘా పెట్టిస్తున్నార‌నీ, వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ భావోద్వేగాల‌తో త‌మ ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆ అధికారులు ఆఫ్ ద రికార్డ్ స‌న్నిహితుల ముందు గోడు వెళ్ల‌గ‌క్కుతున్న‌ట్టు స‌మాచారం. అందుకే, ఆంధ్రాలో ఇలాంటి ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి, తెలంగాణ‌కు వెళ్లిపోతే కాస్త ప్ర‌శాంతంగా ఉద్యోగం చేసుకుని బ‌తికెయ్యొచ్చ‌ని వారు అంటున్నార‌ట‌. మ‌రి, ఈ వ్య‌వ‌హారం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News