ఆ శాటిలైట్ 10వేల మందిని సేవ్ చేసింది

Update: 2016-12-15 06:40 GMT
టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ ప్రయోగించే శాటిలైట్లతో కలిగే ప్రయోజనాలు ఎంతలా ఉంటాయనటానికి తాజా ఉదంతం పెద్ద నిదర్శనంగా చెప్పాలి. రెండు నెలల కిందట (కచ్ఛితంగా చెప్పాలంటే సెప్టెంబర్ 26న) ఇస్రో ప్రయోగించిన శాటిలైట్ పది వేల మంది ప్రాణాల్ని కాపాడటమే కాదు.. భారీ నష్టం జరగకుండా కాపాడిందని చెప్పాలి. తమిళనాడు మీద విరుచుకుపడిన వార్దా తుపాను కారణంగా ఆ రాష్ట్రం ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఏపీని అతలాకుతలం చేస్తుందని భావించిన వార్దా.. చివర్లో తన రూట్ ను మార్చుకొని.. తన ప్రతాపాన్ని తమిళనాడు మీద చూపించింది. వార్దా తన రూట్ ను మార్చుకోనున్న విషయాన్ని.. దాని ప్రభావంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని సెప్టెంబర్ లో ప్రయోగించిన స్కాట్ శాట్.. ఇన్ శాట్ 3 డీఆర్ శాటిలైట్లు పసిగట్టాయి. వాతావరణంలో వచ్చే మార్పులు.. ప్రకృతి వైపరీత్యాల్ని నిశితంగా పరిశీలించి.. వాటికి సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా అందించే గుణం ఉన్న శాటిలైట్ల కారణంగా పెను ముప్పును తప్పించుకున్నామని చెప్పాలి.

తన దిశను మార్చుకున్న వార్దా తుపాను సమాచారాన్ని గుర్తించిన శాటిలైట్లు ఆ సమాచారాన్ని శాస్త్రవేత్తలకు అందించాయి. వెంటనే స్పందించిన శాస్త్రవేత్తలు ఆ సమాచారాన్ని అధికారులకు అందజేయటంతో.. తమిళనాడులోని చెన్నై.. తిరువళ్లూరు.. కాంచీపురం జిల్లాల్లో ముందస్తు చర్యల్ని చేపట్టారు. సహాయక బృందాలు ముందస్తుగా స్పందించి.. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో.. వేలాది ప్రాణాలు సేవ్ అయ్యాయి. వాతావరణ అధ్యయనానికి ఉపయోగపడే శాటిలైట్లను ప్రయోగించిన రెండునెలలకే దాని ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని గుర్తించిన నేపథ్యంలో.. మరిన్ని శాటిలైట్లను ప్రయోగించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News