భారీ ఎన్ కౌంట‌ర్‌..16 మంది మావోల కాల్చివేత‌!

Update: 2018-04-23 04:49 GMT
మావోల‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. గ‌డిచిన 38 ఏళ్ల‌లో ఎప్పుడూ ఎదురుకాని దారుణ ప‌రిస్థితి ఎదురైంది. దండ‌కారణ్యాన్ని తిరుగులేని రీతిలో ఏలుతున్న వారికి త‌గిలిన ఎదురుదెబ్బ మూలం మీద‌నే ప్ర‌భావం చూపించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలీ జిల్లా.. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని బీజాపూర్ స‌రిహ‌ద్దులో ఆదివారం జ‌రిగిన ఎన్ కౌంట‌ర్లో ఏకంగా 16 మంది మావోల ప్రాణాల్ని తీసిన వైనం సంచ‌ల‌నంగా మారింది.

మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు మృతుల్లో ఇద్ద‌రు డివిజిన‌ల్ క‌మిటీ స‌భ్యులు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌కు అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారంతో ఆదివారం ఉద‌యం న‌క్స‌ల్స్ వ్య‌తిరేక ప్ర‌త్యేక ద‌ళానికి చెందిన సీ-60 క‌మాండోలు గ‌డ్చిరోలి జిల్లా భామ‌రాగ‌డ్ మండ‌లం తాడ్ గావ్ స‌మీపాన ఉన్న అట‌వీప్రాంతంలో కూంబింగ్ మొద‌లు పెట్టారు.

క‌మాండోలు ఊహించిన‌ట్లే మావోలు పెద్ద ఎత్తున కంట‌బ‌డ్డారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో 16 మంది మావోలు మృతి చెందిన‌ట్లుగా గుర్తించారు. వారి మృత‌దేహాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోల కార్య‌క‌లాపాల‌కు బీడీ కాంట్రాక్ట‌ర్ల నుంచి వ‌సూలు చేసే డ‌బ్బే ప్ర‌ధానంగా ఉంటుంది. ఇందులో భాగంగా గ‌డ్చిరోలిలోని కాంట్రాక్ట‌ర్ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసేందుకు మావో నాయ‌కులు వ‌చ్చిన‌ట్లుగా పోలీసుల‌కు స‌మాచారం అంది ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన క‌మాండోలు త‌క్ష‌ణ‌మే కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్ట‌టంతో మావోల‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది.

అడ‌వుల్లో 50 నుంచి 60 మంది వ‌ర‌కు మావోలు స‌మావేశ‌మైన‌ట్లుగా స‌మాచారం అందిన‌ట్లుగా పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. మావోల‌కు షాకిచ్చేందుకు సి-60 కమాండోల్ని రంగంలోకి దించారు. మావోల వ్య‌తిరేక ద‌ళానికి దండ‌కార‌ణ్యంలో ల‌భించిన భారీ విజ‌యంగా తాజా ఎన్ కౌంట‌ర్ ను పోలీసు వ‌ర్గాలు అభివ‌ర్ణిస్తున్నాయి. ఈ ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర డీజీపీ స‌తీష్ మాథుర్ సీ-60 కమాండోల్ని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇంత భారీగా మావోల ప్రాణ న‌ష్టం జ‌ర‌గ్గా.. క‌మాండోల‌కు పెద్ద‌గా గాయాలు కాక‌పోవ‌టం విశేష‌మ‌ని చెబుతున్నారు. మృతుల‌కు సంబంధించి మ‌రికొన్ని వార్త‌లు వినే అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో.. ఎన్ కౌంట‌ర్ తీవ్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో తెలుస్తుంద‌ని చెప్పాలి. ఈ ఎన్ కౌంట‌ర్లో మ‌ర‌ణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News