సుజయ్ మాత్రమే కాదు మరో ఇద్దరు కూడా?

Update: 2016-04-15 06:58 GMT
జగన్ కు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ ఓ రేంజ్ లో సాగనున్న విషయం తాజా పరిణామాలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. జగన్ పార్టీ నుంచి పది నుంచి పదిహేను మంది వరకూ జంప్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు తొలుత వినిపించినా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ‘‘అంతకు మించి’’ అనుకోవాల్సిందే. తాజాగా విజయనగరం జిల్లా సంగతే చూస్తే.. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ సైకిల్ ఎక్కనున్నట్లు వార్తలు రావటం.. అవి కన్ఫర్మ్ అన్నది తేలిపోయింది. ఆయన్ను పార్టీ నుంచి వెళ్లిపోకుండా ఉండేందుకు జరిగిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. సుజయ్ కు అత్యంత సన్నిహితుడన్న పేరున్న విజయ్ సాయి రెడ్డిని కలుసుకునేందుకు కూడా ఇష్టపడకపోవటం.. ఇంట్లో లేనని చెప్పి వెనక్కి పంపించటం చూస్తే.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన ఎంతగా సిద్ధమయ్యారో తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే.. సుజయ్ బాటలోనే మరో ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారన్న మాట జగన్ బ్యాచ్ లో కలకలం రేపుతోంది. ఒకవేళ అదే జరిగితే.. జగన్ పార్టీకి కోలుకోలేనంత దెబ్బ తగిలినట్లే. ఎందుకంటే.. తాజా జంపింగ్స్ పూర్తి అయితే జిల్లాలో జగన్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోనుంది. జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సుజయ్ పార్టీ నుంచి వెళ్లిపోవటం ఖాయమని తేలిపోయింది. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు (కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణి.. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర) కూడా సైకిల్ ఎక్కే ప్రయత్నంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. వారిద్దరూ సైకిల్ ఎక్కటం ఖాయమనే కనిపిస్తోంది. పార్టీ నుంచి వీడిపోనున్నరన్న విషయాన్ని తెలుసుకున్న జగన్ పార్టీ నేతలు.. హుడావుడిగా వారిని సంప్రదించేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. వారిద్దరూ పార్టీ నేతలకు అందుబాటులోకి రాని వైనాన్ని చూస్తే వారి జంపింగ్ ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. విజయనగరంలో జగన్ పార్టీ జీరో అయినట్లే.
Tags:    

Similar News