బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ ఆ రెండింటి కోస‌మేనా?

Update: 2018-05-22 06:27 GMT
ఏపీ రాజ‌కీయాల్లో ఊహించిన ప‌రిణామమే చోటు చేసుకుంటోంది! ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడి ఎంపిక ప్ర‌క్రియను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న  బీజేపీ పెద్ద‌లు ఆ ప‌ద‌వికి స‌మ‌ర్థుడిగా మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణను ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఎదురుదాడి చేయ‌డంలో పేరున్న క‌న్నా తాజాగా సంచ‌ల‌న‌ విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌ను ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లాన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు తీరుపై క‌న్నా విరుచుకుప‌డ్డారు. బాబు ఢిల్లీ వెళ్లింది రెండు అంశాల కోస‌మేన‌ని పైగా ఆ రెండు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన‌వేన‌ని క‌న్నా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్ర అభివృద్ధి కంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కే త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు వేదిక‌గా చేసుకున్నార‌ని క‌న్నా ఆరోపించారు. బాబు ఢిల్లీకి వెళ్లిన‌ ప్రతీసారి ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగేందుకే ప్రాధాన్యం ఇచ్చేవార‌ని క‌న్నా ఆరోపించారు. ``చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన స‌మ‌యంలో జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే ఫోకస్ పెట్టారు` అంటూ క‌న్నా సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. చంద్ర‌బాబుకు రాష్ట్ర అభివృద్ధిపై చిత్త‌శుద్ధి ఉంటే కేంద్రం స‌హ‌క‌రించేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కానీ బాబు రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇచ్చార‌ని వివ‌రించారు. చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్నపుడు...కేంద్ర క్యాబినెట్ ఏమీ ఆలోచించకుండానే అంగీకారం తెలిపిందనే విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని క‌న్నా కోరారు. బీజేపీకి ఏపీ అభివృధ్ధిపై చిత్త‌శుద్ధి ఉంద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు వినిపిస్తున్న ప్ర‌త్యేక హోదా గ‌ళం కూడా ఆయ‌న స్వార్థ రాజ‌కీయాల్లో భాగ‌మేన‌ని కన్నా ఆరోపించారు. మొద‌టి నుంచి ప్రత్యేకహోదా స్వరం గట్టిగా వినిపిస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ కు మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని క‌న్నా వెల్ల‌డించారు. అయితే ఈ ఎపిసోడ్‌లో బీజేపీని ముద్దాయిగా ఉంచార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే బాబు రాజ‌కీయాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హిస్తున్నార‌ని త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా మాట‌మారుస్తున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేద‌ని క‌న్నా తెలిపారు.
Tags:    

Similar News