సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు.. తేడా వ‌స్తే షాకిస్తారు కూడా!

Update: 2018-12-24 05:49 GMT
ఇవాళ దిన‌ప‌త్రిక‌లు చూసినోళ్లంద‌రికి ఒక ఫోటో విప‌రీతంగా ఆక‌ట్టుకున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. విశాఖ‌ప‌ట్నం వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. శార‌దా పీఠానికి వెళ్ల‌టం తెలిసిందే. ఆ సంద‌ర్భంగా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామికి అంద‌రి ఎదుట సాష్టాంగ న‌మ‌స్కారం చేయ‌టానికి ఏ మాత్రం సందేహించ‌లేదు. కేసీఆర్ తో పాటు..ఆయ‌న స‌తీమ‌ణి కూడా స్వామివారికి న‌మ‌స్కారం చేశారు.

వాస్తు.. జాత‌కాలు.. యాగాలు.. పూజ‌లు లాంటి సెంటిమెంట్లు కేసీఆర్‌ కు ట‌న్నులు ట‌న్నులుగా ఉంటాయి. స్వాములు ఎవ‌రైనా స‌రే.. కాస్త గురి కుదిరితే చాలు.. కాళ్ల‌కు దండం పెట్టేయ‌టానికి ఏ మాత్రం వెనుకాడ‌రు. ఆ కోవ‌లోనే తాజాగా స్వ‌రూపానందేంద్ర స్వామికి సాష్టాంగ న‌మ‌స్కారం చేశార‌ని చెప్పాలి.

మామూలుగా అయితే.. ఒక ముఖ్య‌మంత్రి ఇలా స్వాములోళ్ల‌కి పాదాభివంద‌నాలు.. సాష్టాంగ న‌మ‌స్కారాలు చేస్తే.. మీడియాలో ఎట‌కారం ఓ రేంజ్లో ఉండేది. ఈ విష‌యాన్నికార్టూనిస్టులు త‌మ క‌లానికి ప‌దును పెట్టి చాట‌లు క‌ట్టేసేటోళ్లు. అయితే.. మారిన కాలంతో పాటు.. స్వాములోరికి సాష్టాంగ న‌మ‌స్కారం పెట్టింది కేసీఆర్ కావ‌టంతో.. అలాంటివేమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి.

నిజానికి ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. వాటికి మ‌ర్యాద ఇచ్చి.. గౌర‌విస్తే సొమ్ములేమీ పోవు. అయితే.. స్వాములోరికి సాష్టాంగ న‌మ‌స్కారం చేసిన కేసీఆర్‌.. అవ‌స‌ర‌మైతే.. అదే స్వామికి షాకిచ్చేందుకు సైతం వెనుకాడ‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏదో యాంగిల్ లో కేసీఆర్‌ ను బ‌ద్నాం చేయాల‌నుకుంటున్నారే అనుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. మేం చెప్పేదానిలో నిజం ఉంద‌న్న విష‌యాన్ని మీరు సైతం అంగీక‌రిస్తారు. అదెలానంటే..

ప్ర‌స్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకున్న స్వామి ప‌రిపూర్ణానందకు సైతం కేసీఆర్ మ‌హా భ‌క్తుడు. ప్ర‌స్తుతానికి కాదు కానీ గ‌తంలో ప‌రిపూర్ణ‌నంద‌కు కేసీఆర్ స‌న్నిహితంగా ఉండేవారు. ఎక్క‌డి దాకానో ఎందుకు ప్ర‌గ‌తి భ‌వ‌న్ గృహ‌ప్ర‌వేశానికి ఆహ్వానం ల‌భించిన స్వాముల్లో ప‌రిపూర్ణానంత ఒక‌రు. ఆయ‌న ఇంటికి వెళ్లిన‌ప్పుడు.. స్వామివారి కాళ్ల‌కు న‌మ‌స్కారం చేశారు కేసీఆర్ దంప‌తులు. ఇక్క‌డ క‌ట్ చేసి.. కొన్ని నెల‌ల త‌ర్వాత అదే ప‌రిపూర్ణ‌నంద స్వామి వ‌ర్సెస్ క‌త్తి మ‌హేశ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన‌ప్పుడు పోలీసుల అదుపులోకి స్వాములోరి వెళ్ల‌ట‌మే కాదు.. న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు త‌ప్ప‌లేదు.

మొత్తంగా చెప్పేదేమంటే.. న‌మ్మిన‌ప్పుడు విన‌యంగా.. భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో సాష్టాంగ న‌మ‌స్కారాలు ఎలా చేస్తారో..కాస్త లెక్క తేడా వ‌చ్చినా.. న‌మ్మ‌కం పాళ్లు త‌గ్గినా అదే రేంజ్లో షాకులు ఇవ్వ‌టం కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మైన య‌వ్వారం. ఇవాళ‌.. సాష్టాంగ న‌మ‌స్కారాల‌కు ప్ర‌తిగా రాబోయే రోజుల్లో షాకులు కూడా ఉండే ప్ర‌మాదం పొంచి ఉంటుంది సుమా!



Tags:    

Similar News