14 నెలల తర్వాత నరకం నుంచి ఇంటికొచ్చారు

Update: 2016-09-24 07:47 GMT
నరకం ఏమిటి..? తిరిగి రావటం ఏమిటి? అన్న సందేహం వస్తుందా? అక్కడికే వస్తున్నాం. భూలోక నరకంగా అభివర్ణించే తీవ్రవాదుల చెరలోకి  వెళ్లిన తర్వాత తిరిగి రావటం అంటే మాటలు కాదు. దయా.. దాక్షిణ్యం లాంటివి ఏమీ ఉండదని తీవ్రవాదుల చెరలోకి వెళితే.. నూకలు చెల్లినట్లే. గత ఏడాది జులై 29న తెలుగు ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లను లిబియాలోని తీవ్రవాదులు కిడ్నాప్ చేయటం తెలిసిందే.

యుద్ధ కల్లోలంతో అట్టుడికిపోతున్న లిబియాలోని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు ప్రొఫెసర్ల ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులువీరి విడుదల కోసం ప్రయత్నాలు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించి.. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి వీరి ఉదంతాన్ని ప్రత్యేకంగా తీసుకెళ్లటం.. భారత ప్రభుత్వం వీరి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది.

అయితే.. తీవ్రవాదుల చెర నుంచి బయటకు రాకున్నా.. వారి ప్రాణాలకు ముప్పులేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత కానీ టెన్షన్ తగ్గలేదు. బయటవాళ్లకు టెన్షన్ లేకున్నా.. ఉగ్రవాదుల చెరలో ఉండటం అంటే.. పాము పడగ కింద ఉన్నట్లే. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచిన 14 నెలలుగా క్షణాల్ని రోజులుగా.. రోజుల్ని సంవత్సరాలు  భావిస్తూ.. భారంగా వెళ్ల దీస్తున్న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్ల కుటుంబాలకు ఇవాళ పండగ రోజే. ఇటీవల ఉగ్రవాదుల చెర నుంచి బయట పడిన వారిని విదేశాంగ అధికారులు జాగ్రత్తగా హైదరాబాద్ తీసుకొచ్చారు.

ఈ ఇద్దరు తెలుగుప్రొఫెసర్లు హైదరాబాద్ నివాసులే. వారిలో గోపీకృష్ణది నాచారంలోని రాఘవేంద్రకాలనీ అయితే.. బలరాంకిషన్ ది తిరుమలగిరి. వీరి రాకతో వారి వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అన్నేసి నెలల పాటు నరకంలో ఉన్న వారు.. వారి కుటుంబ సభ్యులు ఎంతటి మానసిక క్షోభ అనుభవించి ఉంటారో కదూ..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News