అధికారికం: బాదుడుకు 2 వారాలు బ్రేక్!

Update: 2018-05-02 05:45 GMT
దెబ్బ కొట్టాలి. దిమ్మ తిరిగిపోవాలన్న‌ది పాత మాట‌. దెబ్బ కొట్టినా దిమ్మ తిర‌గ‌కూడ‌దు. ఆ మాట‌కు వ‌స్తే దెబ్బ కొట్టిన‌ట్లుగా కూడా తెలీకూడ‌దు. అది కొత్త ట్రెండ్‌. ఘ‌న‌త వ‌హించిన ప్ర‌ధాని మోడీ అనుస‌రిస్తున్న విధానం. బాదుడు విష‌యంలో మోడీ స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానాలు చూస్తే.. అనూహ్యంగా ఉంటాయ‌ని చెప్పాలి. పైకి.. కొత్త ఆశ‌ల్ని క‌ల్పిస్తున్న‌ట్లుగా ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు ఉద్దేశం మాత్రం వేరుగా ఉండ‌టం మోడీ ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి.

పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానానికి రెండు వారాల పాటు బ్రేక్ ఇస్తున్న‌ట్లుగా చ‌మురు సంస్థ‌లు వెల్ల‌డించాయి. యూపీఏ హ‌యాంలో నెల‌కు రెండుసార్లు (ప‌దిహేనో తేదీ.. నెల చివ‌రి రోజు) అంత‌ర్జాతీయంగా ఉన్న ముడిచ‌మురు ధ‌ర‌ల్ని ప‌రిశీలించి.. ధ‌ర‌ల్ని త‌గ్గించ‌ట‌మా?  పెంచ‌ట‌మా? అన్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

మోడీ స‌ర్కారు వ‌చ్చాక ఆ విధానానికి కొన్ని మార్పులు చేసి.. రోజువారీగా ధ‌ర‌ల్ని పెంచ‌ట‌మో.. త‌గ్గించ‌ట‌మో చేయాల‌ని నిర్ణ‌యించారు.ఈ విధానాన్ని అమ‌లు చేయ‌టానికి ముందు.. కొత్త విధానం ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తుంద‌ని.. ధ‌ర‌ల్ని ఏ రోజుకు ఆ రోజు డిసైడ్ చేయ‌టం లాభ‌మే కానీ న‌ష్ట‌మే ఉండ‌ద‌న్న మాట వినిపించారు. వాస్త‌వంలో మాత్రం అందుకు భిన్నంగా ధ‌ర‌ల పెంపు మీద దృష్టి పెట్టారే కానీ త‌గ్గింపు విష‌యం మీద ఫోక‌స్ లేద‌న్న విమ‌ర్శ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ప్ర‌స్తుతం గ‌రిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

అంత‌ర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచ‌మురు 80 డాల‌ర్లు దాట‌న‌ప్ప‌టికీ పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు మాత్రం భారీగా ఉన్నాయి. యూపీఏ హ‌యాంలో బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 110 డాల‌ర్లు ఉన్న‌ప్పుడు ఎంత అయితే వ‌సూలు చేశారో.. ఇప్పుడు అవే ధ‌ర‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

క్యాలెండ‌ర్లో రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి కీల‌కంగా మార‌ట‌మే.. పెట్రో ధ‌ర‌లపై కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. రోజువారీగా స‌మీక్షిస్తున్న ధ‌ర‌ల విధానానికి బ్రేకులు వేస్తున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. రెండు వారాల పాటు ధ‌ర‌ల్ని స‌మీక్షించ‌టం నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇందుకు కార‌ణం ఏమిట‌న్న విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇటీవ‌ల పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లపై రాష్ట్రాలు సీరియ‌స్ కావ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల నుంచి మోడీ స‌ర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. క‌ర్ణాట‌క రాష్ట్రంలో కీల‌క ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ధ‌ర‌ల బాదుడుకు చెక్ చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్న వేళ‌.. ధ‌ర‌ల్ని మార్చ‌కుండా కంటిన్యూ చేయ‌టం. ధ‌ర‌లు త‌గ్గేందుకు వీలుగా ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించుకుంటే ధ‌రాభారం త‌గ్గే అవ‌కాశం ఉంది. ఆ ప‌ని చేస్తే కేంద్రానికి వ‌స్తే ఆదాయం త‌గ్గే వీలుంది. ఈ కార‌ణంతో ఆ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌ట్లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ధ‌ర‌ల్ని పెంచ‌కుండా ఉండ‌టం.. ఎన్నిక‌లు పూర్తి అయిన త‌ర్వాత ధ‌ర‌ల పెంపును కంటిన్యూ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ అదే జ‌రిగితే.. రెండు వారాల బ్రేక్ కు ఆ త‌ర్వాత దేశ ప్ర‌జ‌లు మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.
Tags:    

Similar News