ఏపీ అసెంబ్లీ: తొలిరోజే ఇద్ద‌రి మీద వేటు!

Update: 2015-12-17 07:44 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశంలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. శీతాకాల స‌మావేశాలు మొద‌లైన మొద‌టిరోజే.. ఇద్ద‌రు విప‌క్ష స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తూ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. గురువారం ఉద‌యం అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మైనప్ప‌టి నుంచి కాల్ మ‌నీ మీద చ‌ర్చ జ‌ర‌పాల‌ని విప‌క్షం.. శుక్ర‌వారం కాల్‌ మ‌నీ మీద చ‌ర్చ జ‌రిపేందుకు తాము సిద్ధ‌మ‌ని అధికార‌ప‌క్షం ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. విప‌క్షం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ సంద‌ర్భంగా విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న‌ల మ‌ధ్య స‌భ ప‌లుమార్లు వాయిదా ప‌డింది.

రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్ మీద చ‌ర్చ జ‌రపాల‌ని ఏపీ అధికార‌ప‌క్షం ప్ర‌య‌త్నిస్తే.. విప‌క్షం అడ్డుకుంటుంద‌ని అధికార‌ప‌క్ష స‌భ్యులు మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న చేస్తున్న వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ స‌భ్యులను స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. అదే స‌మ‌యంలో కెమేరాల‌కు అడ్డుప‌డుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. బి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి, రామ‌లింగేశ్వ‌ర‌రావుల‌ను స‌స్పెండ్ చేయాల‌ని మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌తిపాదించ‌గా.. స్పీక‌ర్ వారిని రెండు రోజుల పాటు స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీంతో.. స‌భ‌లో పెద్ద ఎత్తున గంద‌ర‌గోళం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో.. స‌భ‌ను న‌డ‌ప‌టం క‌ష్టంగా భావించిన స్పీక‌ర్ కోడెల‌.. స‌భ‌ను శుక్ర‌వారానికి వాయిదా వేశారు. దీంతో.. అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభ‌పు రోజున ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే ముగిసిన‌ట్లైంది.
Tags:    

Similar News