ట్విట్టర్ సంచలన నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం

Update: 2019-10-31 06:34 GMT
ఏ నిర్ణయాన్ని ఏ ప్రముఖ కంపెనీ ఊరికే తీసుకోదు. దాని వెనుక చాలానే లెక్కలు ఉంటాయి. కంటికి కనిపించే దానికి భిన్నమైన వాస్తవం కంటికి కనిపించకుండా ఉండొచ్చు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా సంస్థల్లో ఒకటైన ట్విట్టర్ తాజాగా సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.

సంస్థ సీఈవో జాక్ డోర్సే ఒక ట్వీట్ చేశారు. దీని ప్రకారం తమ వేదిక మీద నుంచి రాజకీయ ప్రకటనల్ని తాము నిలిపివేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలే తప్పించి.. వాటిని కొనకూడదన్న కీలక వ్యాఖ్యను ఆయన ట్వీట్ చేయటం గమనార్హం. దీంతో.. రాజకీయ ప్రకటనలకు తాము దూరంగా ఉంటామని స్పష్టం చేసినట్లైంది.

రాజకీయ ప్రకటనలపై ఒత్తిడి అంతకంతకూపెరిగిపోతున్న వేళ.. అన్ని రాజకీయ ప్రకటనలను తమ వేదిక నుంచి బ్యాన్ చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకోవటంతో రానున్న రోజుల్లో మరిన్నిపరిణామాలు చోటుచేసుకోనున్నాయని చెబుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన మిగిలిన వివరాల్ని నవంబరు 15న వెల్లడిస్తామని.. నవంబరు 22 నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటనల్ని తాము అంగీకరించమన్నారు.

ట్విట్టర్ చేసిన ఈ సంచలన ప్రకటనకు అమెరికా విపక్షమైన డెమొక్రాట్లు సానుకూలత వ్యక్తం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే.. అధికారిక రిపబ్లిక్లు మాత్రం అందుకు భిన్నంగా ఎటకారం చేయటం గమనార్హం. కొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తెర లేవనున్న వేళ.. ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం కీలకమన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News