ఉబెర్... ఆన్ టూ వీలర్

Update: 2016-12-12 06:56 GMT
ఇకనుంచి అద్దె వాహనాలు అంటే క్యాబ్ లు, ఆటోలు మాత్రమే కాదు. బైక్ లు సైతం వచ్చేశాయ్. అద్దె వాహనాలను కొత్త పుంతలు తొక్కించిన ఊబర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నగరంలో అద్దెకు దొరికే వాహనాల విషయానికి వస్తే ఆటో రిక్షాలు, క్యాబ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే త్వరలో బైక్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఉబర్ సంస్థ జనవరిలో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తోంది. మొదటి దఫాగా 74 వెహికిల్స్‌ను సిద్ధం చేసింది. మంగళవారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదర్శించనుంది. వీటికి చోదకులను కూడా ఎంపిక చేసింది.

ఇప్పటికే అనేక నగరాల్లో బైక్‌టాక్సీ ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇప్పుడు హైదరాబాద్‌లో మొట్టమొదటిసారీగా శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు పూర్తయినప్పటికీ మోటార్ వాహనాల చట్టం ప్రకారం వీటిని డ్రైవింగ్ చేసేందుకు డ్రైవర్లకు అర్హత ఉండాలి. డ్రైవర్లకు టూ వీలర్ లైసెన్సులు ఇప్పటికే ఉన్నప్పటికీ బ్యాడ్జీ ఉండి తీరాలి. బ్యాడ్జీ కోసం రెండ్రోజుల క్రితం లెర్నింగ్ లైసెన్సు తీసుకున్న డ్రైవర్లు శాశ్వత లైసెన్సులు ఉంటేగానీ ప్యాసింజర్లను బైక్‌లను ఎక్కించుకునే వీలుండే అవకాశం లేనందున మరో నెల రోజుల తర్వాత ప్యాసింజర్లతో తిరిగే అవకాశం లేదు. బ్యాడ్జీ లైసెన్సు వస్తేనే ప్రయాణికులను ఎక్కించుకునే వీలుంటుంది. ఇదిలా ఉంటే టూ వీలర్స్‌కు మాత్రం రవాణాశాఖ ట్యాక్సీ ప్లేట్లను అమర్చింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ఆర్‌టీవో కార్యాలయాల పరిధిలో వీటికి సంబంధించిన డ్రైవర్ల లెర్నింగ్ లైసెన్సులు జారీ అయ్యాయి. ప్రాజెక్టు విజయవంతమైతే మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు ఉబర్ వర్గాలు తెలిపాయి.

క్యాబ్స్‌లు, ఆటోల్లో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే చార్జీలు రూ.100 దాటే అవకాశం ఉంది. ఒక్క ప్రయాణికుడు ప్రయాణించినా, ముగ్గురు అయినా దూరం, సమయాన్ని పరిగణలోకి తీసుకుని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వర్షం పడినా, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నా ఒక్కోసారి చార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం లేకపోలేదు. బైక్ టాక్సీకి క్యాబ్ లేదా ఆటోకు అయ్యే చార్జీల్లో సగం కూడా కావు. కిలోమీటరు చొప్పున చార్జీలు వసూలు చేస్తారు. క్యాబ్‌లు బైక్‌టాక్సీలో మాత్రం ఒక్క ప్రయాణికుడికి అవకాశం ఉంటుంది. ఒకరికి మించి వెళ్లాలనుకుంటే క్యాబ్ లేదా ఆటో బుక్ చేసుకోవచ్చు. ఒక్కరు వెళ్లాలంటే బైక్‌టాక్సీలో సరసమైన చార్జీకే గమ్యస్థానం చేరవచ్చు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో కార్లు, ఆటోలు ట్రాఫిక్‌లో చిక్కుకుని నిర్ణీత సమయానికి గమ్యానికి చేరుకోవు. బైక్‌ట్యాక్సీ ద్వారా నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేరే వీలుంటుంది. పార్కింగ్ సమస్య కూడా ఉండదు. ఫీజు ఉండదు. ఒక ప్రయాణికుడు తన సొంత బైక్ తీసుకుని పేయిండ్ పార్కింగ్‌లో పెట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేయిడ్ పార్కింగ్‌లో పెట్టకుండా ఎక్కడైనా పార్కింగ్ చేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అన్నదీ అనుమానమే. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో సొంత వాహనం పెట్టి వెళ్తే వచ్చే వరకు పార్కింగ్ ఫీజు బస్సు, రైలు చార్జీలకు మించి పోతుంది. ఇక కాలుష్యం విషయంలో కూడా ఆటోలు, క్యాబ్‌లతో పోలిస్తే చాలా తక్కువ. ఏ రకంగా చూసినా బైక్‌టాక్సీ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉబర్ క్యాబ్ బుకింగ్ యాప్‌ను పోలిన సరికొత్త యాప్‌ను ఉబర్ రూపొందిస్తున్నది. యాప్ ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లే బైక్‌ను కూడా బుక్ చేసుకుంటే నిమిషాల వ్యవధిలో ఇంటి ముందు వచ్చి వాలిపోతుంది. ప్రయాణించిన దూరానికి చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అన్ని కంపెనీలకు సంబంధించిన టూ వీలర్స్‌ను ఉంటాయి. హోండా,యమహా, హీరో, ఎన్ ఫీల్డ్, స్యూటీ, హోండా ఆక్టివా, సుజుకీ, మహీంద్రా వంటి అన్ని రకాల టూ వీలర్ టాక్సీలుగా ఉంటాయి.రవాణాశాఖ నిబంధనల ప్రకారం అంతా ట్యాక్సీ బైక్ చట్టబద్దమే. క్యాబ్‌లు ఇతర వాహనాల మాదిరిగానే టూ వీలర్‌కు ట్యాక్సీ పర్మిట్ ఉంటుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటుంది. కార్లను టాక్సీగా కన్వర్ట్ చేసే పద్ధతిలోనే ప్రస్తుతం బైక్‌లను రవాణాశాఖ కన్వర్ట్ చేస్తున్నదని సమాచారం.

బైక్ టాక్సీలను నడపేందుకు మహిళా డ్రైవర్లు కూడా ముందుకొచ్చారు. మహిళా ప్రయాణికుల కోసం మహిళ బైక్ టాక్సీ డ్రైవర్లను ఉబర్ అందిస్తోంది. వీరు డ్రైవింగ్‌లో శిక్షణ ఉన్నవారు. పైగా నగర రోడ్లు క్షుణ్ణంగా తెలిసిన వారినే వినియోగిస్తున్నారు. 13న జరిగే కార్యక్రమమలో బైక్ సర్వీసులను ప్రారంభించడమే కాకుండా వీటికి సంబంధించిన రక్షణ చర్యలు, బుకింగ్ విధానం, చార్జీలు వంటివి అధికారికంగా ఉబర్ సంస్థ వెల్లడించనుంది.
Tags:    

Similar News