మ‌హారాష్ట్ర‌లో తొమ్మిదిమంది రెబ‌ల్ మంత్రులకు ఉద్ధ‌వ్ షాక్!

Update: 2022-06-27 10:30 GMT
మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం అంత‌కంత‌కూ ముదురుతోంది. ఉద్ధ‌వ్ ఠాక్రే మంత్రివ‌ర్గంలోని సీనియ‌ర్ మంత్రి ఏక‌నాథ్ షిండే తిరుగుబాటును లేవ‌నెత్తి ప్ర‌స్తుతం అసోంలో క్యాంప్ వేసిన సంగతి తెలిసిందే. ఆయ‌న‌తో మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 9 మంది మంత్రులే కావ‌డం గ‌మ‌నార్హం. ఉద్ధ‌వ్ ఠాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి బ‌య‌ట‌కొచ్చి బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని రెబ‌ల్ నేత‌లు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట గుజ‌రాత్ లోని సూర‌త్ లో క్యాంప్ వేసిన రెబ‌ల్ ఎమ్మెల్యేలు ప్ర‌స్తుతం అసోంలోని గువ‌హ‌టిలో ఉన్నారు.

ఇప్ప‌టికే ఉద్ధ‌వ్ ఠాక్రే రెబ‌ల్ నేత‌ల‌పై సామ‌దానబేధ దండోపాయాల‌న్నీ ప్ర‌యోగించారు. అయినా వారు దారికి రాక‌పోవ‌డంతో ముందుగా 16 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీ చేశారు. వారు జూన్ 27న సోమ‌వారం ముంబైలో డిప్యూటీ స్పీక‌ర్ కార్యాల‌యంలో హాజ‌రవ్వాల‌ని హెచ్చ‌రించారు. లేదంటే వారిపై అన‌ర్హ‌త అస్త్రం ప్ర‌యోగిస్తామ‌న్నారు. దీనిపై ఏక‌నాథ్ షిండే వ‌ర్గం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

ఈ ప‌రిస్థితిలో ఏక‌నాథ్ షిండే క్యాంపులో ఉన్న తొమ్మిది మంత్రుల‌కు ఉద్ధ‌వ్ ఠాక్రే షాకిచ్చారు. వారి ఫోర్టుపోలియోల‌ను ఇత‌ర మంత్రుల‌కు కేటాయించారు. రెబల్ మంత్రులు రాష్ట్రంలో లేకపోవడంతో ఆయా శాఖలను నిర్వహించేందుకు ఉద్ధవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ థాక్రేతోపాటు నలుగురు కేబినెట్ మంత్రులు ఆదిత్య థాక్రే, అనిల్ పరబ్, సుభాష్ దేశాయి మాత్రమే మహారాష్ట్రలో ఉన్నారు. వీరిలో ఆదిత్య థాక్రే ఉద్ధ‌వ్ ఠాక్రే కుమారుడ‌న్న విష‌యం తెలిసిందే.

ఏక్ నాథ్ షిండ్ నిర్వహిస్తున్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖను ఎమ్మెల్యే సుభాష్ దేశాయ్‌కు సీఎం ఠాక్రే అప్పగించారు. గులాబ్రావ్ పాటిల్ నిర్వహిస్తున్న నీటి సరఫరా, పారిశుధ్యం శాఖను అనిల్ పరబ్‌కు ఇచ్చారు. అలాగే దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలతో పాటు సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను ఎమ్మెల్యే శంకర్ గడఖ్ కు అప్పగించారు.

ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు శాఖలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ (యాద్రవ్‌కర్) వద్ద ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలను విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌ వద్ద ఉన్న మూడు శాఖలను ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేకు అప్పగించారు. ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు శాఖలను అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు.

కాగా ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి శాస‌న‌ సభలో మెజార్టీ లేదని.. మొత్తం 55 ఎమ్మెల్యేల్లో 38 మంది తమ వద్దే ఉన్నారని సుప్రీంకోర్టులో షిండే వర్గం పిటిషన్ దాఖలు చేసింది. తామంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. తమపై విధించిన అనర్హత వేటు చెల్లదని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు నివేదించారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల త‌ర‌ఫున ప్ర‌ముఖ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే వాద‌న‌లు వినిపించ‌నున్నారు.
Tags:    

Similar News