శిరీడీపై వెన‌క్కు త‌గ్గిన సీఎం.. రాజీకొచ్చారు!

Update: 2020-01-21 05:39 GMT
మ‌హారాష్ట్రాలోని పాథ్రీగ్రామం శిరిడీ సాయి జ‌న్మ‌స్థ‌లంగా అభివృద్ధి చేయ‌డం గురించి రేగిన వివాదం స‌మ‌సిపోయింది. ఆ విష‌యంలో ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. త‌ను ప‌రిశోధ‌కుడిని కానంటూ ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పాథ్రీని సాయిబాబా జ‌న్మ‌స్థ‌లంగా అభివృద్ధి ప‌ర‌చ‌డానికి వెయ్యి కోట్ల రూపాయ‌లను కేటాయించ‌డంపై శిరిడీ సంస్థాన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.

పాథ్రీ త‌న జ‌న్మ‌స్థ‌లం అని ఎప్పుడూ బాబా చెప్ప‌లేద‌ని శిరిడీ ఆల‌య క‌మిటీ ప్ర‌క‌టించింది. వివాదాన్ని రేపుతున్నారంటూ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అంతేగాక‌..శిరిడీలోని సాయి ఆల‌యాన్ని మూసి వేసి మ‌రీ సంచ‌ల‌నం రేపింది. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌కు వ్య‌తిరేకంగా అలాంటి ర‌చ్చ రేగింది. ఆల‌యం మూసి వేత ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.  

అయితే ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి వెన‌క్కు త‌గ్గారు. త‌ను ప‌రిశోధ‌న చేసి ఏమీ మాట్లాడ‌లేదంటూ ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే వెయ్యి కోట్ల‌ రూపాయ‌ల కేటాయింపు విష‌యంలో మాత్రం ఆయ‌న వెన‌క్కు త‌గ్గ‌లేదు. పాథ్రీ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయ‌ల నిధుల కేటాయింపును కొన‌సాగించారు. అయితే దాన్ని సాయి బాబా పుట్టిన ఊరుగా ప‌రిగ‌ణించే ఉద్దేశం మాత్రం లేద‌ట‌. అధికారికంగా అలాంటి ప్ర‌క‌ట‌న‌లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఉండ‌బోవ‌ని అలా క్లారిటీ ఇచ్చారు సీఎం.

పాథ్రీ అభివృద్ధికి నిధుల కేటాయింపు ప‌ట్ల శిరిడీకి కూడా అభ్యంత‌రం లేద‌ని సంస్థాన్ ప్ర‌క‌టించింది. అయితే పాథ్రీ సాయిబాబా జ‌న్మ‌స్థ‌లం అన‌డంలో మాత్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. సీఎం త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకోవ‌డంతో.. శిరిడీ సంస్థాన్ కూడా రాజీకి వ‌చ్చింది. అలా టీక‌ప్పులో తుఫాన్ చ‌ల్లారింది.
Tags:    

Similar News