కరుణానిధి టూ ఉదయనిధి : వారసుడొచ్చాడు

Update: 2022-12-14 23:30 GMT
తమిళనాడు చాలా వాటికి ఇతర రాష్ట్రాలకు స్పూర్తిగా ఉంది. ముఖ్యంగా సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ కావడం అన్నడి తమిళనాడు నుంచే ఆరంభం అయింది. అలాగే ప్రాంతీయ పార్టీలు స్థానిక భాష, రాజకీయ అరాటాలు, పోరాటాలు, అస్థ్తిత్వం ఇవన్నీ కూడా తమిళనాడు ఇతర ప్రాంతాలకు ఒక దారి చూపించింది అని చెప్పాలి. అక్కడ ద్రవిడ ఉద్యమం బలంగా వేళ్ళూనుకుంది. దాని నుంచి సామాజిక సమీకరణలు మారిపోయి చివరికి రాజకీయ రూపం సంతరించుకుంది. అలా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ 1949లో  ఏర్పాటు అయింది.

దానికి అన్నాదురై మొదటి ముఖ్యమంత్రి అయితే ఆయన అనుచరుడిగా కరుణానిధి నెక్స్ట్  చీఫ్ మినిస్టర్ గా 1969లో అయ్యారు. ఆయనతో పాటు అదే పార్టీలో ఉన్న ఆనాటి తమిళ చలనచిత్ర ప్రఖ్యాత నటుడు ఎంజీ రామచంద్రన్ ఆ తరువాత డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నా డీఎంకేను ఏర్పాటు చేశారు. ఆయన కూడా పదేళ్ల పాటు సీఎం అయ్యారు.

ఇక డీఎంకే గురించి తీసుకుంటే అన్నాదురై నుంచి పార్టీ పగ్గాలు అందుకున్న కరుణానిధి తన జీవితకాలం అంతా సారధ్యం వహించారు. ఆయన 2018లో మరణించాక కుమారుడు స్టాలిన్ చేతికి పగ్గాలు వచ్చాయి. అలా కరుణానిధి వారసత్వం స్టాలిన్ కి దక్కింది. 2021లో జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ తమిళనాడులో విజయఢంకా మోగించి సీఎం అయ్యారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యే అయ్యారు.

ఇక తాజాగా ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా స్టాలిన్ డీఎంకేలో మూడవ తరం వారసత్వాన్ని పైకి లేపారు. ఇప్పటికే తండ్రి స్టాలిన్ పార్టీ సారధిగా ఉంటే యువజన విభాగం బాధ్యతలు ఉదయనిధి చూసుకుంటున్నారు. ఇపుడు తండ్రి సీఎం, కొడుకు మినిస్టర్ గా తమిళనాడులో డీఎంకేలో కొత్త వారసుడు బలంగా ప్రవేశించినట్లు అయింది. ఏడు పదుల వయసులో ఉన్న స్టాలిన్ మరో దఫా కూడా సీఎం గా చేసే సామర్ధ్యంతో ఉన్నారు.

ఆయన ఈ రోజుకీ ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నిత్యం వ్యాయామం చేస్తారు.  ఆయన ఏజ్ పరంగా చూస్తే దృఢంగా ఉన్నారు అని చెప్పాలి. 2026లో తమిళనాడుకు మరో దఫా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో కూడా డీఎంకే విజయం నల్లేరు మీద నడకే కావచ్చు. దాదాపుగా ఏణ్ణర్ధం పైగా సాగిన స్టాలిన్ పాలనలో తమిళనాడులో విమర్శలు ఏమీ లేవు. జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు. పైగా స్టాలిన్ మంచి పాలన అందిస్తున్నారు అని ఇంటా బయటా కితాబులు ఉన్నాయి.

ఇక స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి  చేదోడు వాదోడుగా ఉంటూ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించారు. ఇపుడు స్టాలిన్ కూడా తనకు సహాయకారిగా కుమారుడు ఉదయనిధిని తెచ్చుకున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న నవ యువకుడు ఉదయనిధి. ఆయన హీరోగా అనేక సినిమాలు చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఇపుడు తాత తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. తాను బలంగా ఉండగా పార్టీ గట్టిగా ఉండగానే కుమారుడి రాజకీయ భవిష్యత్తు తీర్చిదిద్దాలన్న స్టాలిన్ ముందు చూపు వల్లనే ఉదయనిధి మంత్రి అయ్యారు.

ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టు సాధిస్తూ పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తూ 2031లో ఎన్నికల నాటికి ఉదయనిధి సీఎం అయ్యేలా తండ్రి స్టాలిన్ పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. అటు చూస్తే అన్నా డీఎంకేలో జయలలిత మరణాంతరం లుకలుకలు ఉన్నాయి. సరైన నాయకత్వం లేదు. ఆమెకు వారసులు అంటూ లేరు. దాంతో అదిన్వచ్చిన అవకాశాన్ని పుచ్చుకుంటూ డీఎంకేని   తమిళనాట పెట్టని కోటగా మార్చడానికి స్టాలిన్ చూస్తున్నారు.

2029 నాటికి అంటే ఇప్పటికి మరో పదిహేడేళ్ళకు డీఎంకే పుట్టి వందేళ్ళు అవుతాయి. ఆనాటికి ఉదయనిధి స్టాలిన్ నాయకత్వాన పార్టీ ప్రకాశించాలని, ఎప్పటికీ తమిళనాట ద్రవిడ మున్నేట్ర కజగం జెండా రెపరెపలు ఆడాలని స్టాలిన్ చాలా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమే ఆయనకు మంత్రి పదవి. మొత్తానికి తమిళనాడు ప్రాంతీయ రాజకీయంలో కొత్త వారసుడు వచ్చాడు. కరుణానిధి లెగసీని కోన్సాగించడమే ఇక ఉదయనిధి మీద ఉన్న అతి పెద్ద బాధ్యత.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News