భార‌తీయుల‌కు ఆ తెల్లాయ‌న ఇల్లు ఇవ్వ‌డ‌ట‌

Update: 2017-11-11 11:12 GMT
లండ‌న్ లో ఉన్న శ్రీ‌మంతుల్లో ఆ పెద్ద‌మ‌నిషి ఒక‌డు. తెల్లతోలున్న ఆయన త‌న‌కున్న ఇళ్ల‌ను అద్దెకు ఇస్తుంటాడు. అలా ఇచ్చే స‌ద‌రు వ్య‌క్తి కొత్త కండీష‌న్ పెడుతున్నాడు. అదేమంటే.. భార‌తీయుల‌కు ఇల్లు అద్దెకు ఇవ్వ‌నంటే ఇవ్వ‌న‌ని తేల్చేస్తున్నాడు.

మాట‌ల‌తోనే కాదు.. చివ‌ర‌కు అద్దెకు ఇళ్ల‌ను వెతికిపెట్టే ఏజెన్సీ కూడా ఆయ‌నీ లేఖ రాశారు. దీంతో.. కేసైంది. కోర్టులోనూ ఈ పెద్ద మ‌నిషి.. భార‌తీయుల‌కు ఇళ్లు ఇవ్వ‌టానికి కుద‌ర‌దంటే కుద‌ర‌ద‌ని తేల్చేశాడ‌ట‌. ఎందుకింత జాత్యాహంకారం అంటూ కోర్టు క‌న్నెర్ర చేసింది.

దీనికి బదులిచ్చిన ఆయ‌న‌.. తన‌కు జాత్యాంహ‌కారం లేద‌ని.. తెలుపు.. న‌లుపు అన్న తేడా లేద‌ని చెప్పాడు. త‌న‌కు చాలానే ఇళ్లు ఉన్నా.. భార‌తీయుల‌కు మాత్రం ఇల్లు ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నాడు. ఇంగ్లండ్ లోని కెంట్ ప్రాంతంలో త‌న‌కు చాలా ఇళ్లు ఉన్నాయ‌ని.. కానీ భార‌తీయుల‌కు ఇళ్లు అద్దెకు ఇస్తుంటే ఘాటైన కూర‌లు వండుతున్నార‌ని.. దీంతో ఇల్లు మొత్తం చెడిపోతుంద‌ని వాపోతున్నాడు.

ఈ మ‌ధ్య‌న భార‌తీయుల‌కు ఇచ్చిన ఇంటిని ఘాటైన వాస‌న‌లు రాకుండా చేయ‌టం కోసం రిపేర్ల కోసం ఏకంగా రూ.10ల‌క్ష‌ల‌కు పైనే ఖ‌ర్చుచేసిన‌ట్లుగా వెల్ల‌డించాడు. ఈ కార‌ణంతోనే తాను ఇల్లు ఇవ్వ‌న‌ని చెబుతున్నాన‌ని కోర్టుకు వెల్ల‌డించాడు. అయితే.. ఆయ‌న వాద‌న‌ను స్థానిక కోర్టు అంగీక‌రించ‌లేదు. స‌మాన‌త్వం.. మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ కు ఈ నిర్ణ‌యం చ‌ట్ట‌వ్య‌తిరేకం అవుతుంద‌ని కోర్టు పేర్కొంది. మ‌రి.. లండ‌న్ వ్యాపార‌వేత్త ఫెర్గ‌స్ విల్స‌న్ ఇప్ప‌టికైనా భార‌తీయుల‌కు ఇళ్లు అద్దెకు ఇస్తాడా? అన్న‌ది తేలాల్సి ఉంది. . రాజ‌కీయం రంగు పులుముకున్న ఈ వ్య‌వ‌హారం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. లండ‌న్ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో ఈ వార్త ప్ర‌ముఖంగా అచ్చు అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం సోష‌ల్ మీడియా దృష్టికి వ‌స్తే భార‌తీయుల స్పంద‌న  ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News