'ఎకరం'.. 'అర ఎకరం' పోయిందని ఎటకారం ఆడేస్తే దెబ్బే

Update: 2022-05-14 08:28 GMT
ఇప్పటికి అర ఎకరం పోయింది.. అజాగ్రత్తగా ఉండే ఉన్న ఎకరం పోవటం ఖాయం అంటూ ఆట పట్టించేటోళ్లు బోలెడంతమంది ఉంటారు. ఈ భూప్రపంచం మీద సమస్యలు లేని జీవిగా పురుష పుంగవుల మీద పడి ఏడుస్తారు కానీ.. అతగాడి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు ఇంకెవరికైనా ఉంటాయా? అని ఆగ్రహంగా అడిగేస్తుంటారు.

ఎక్కడి దాకానో ఎందుకు.. మగాడి ఆత్మవిశ్వాసాన్ని నిలువునా నీరుకార్చే బట్టతలతో వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. అలాంటి బట్టతల మీద ఎవరైనా ఇప్పుడు జోకులు వేసినా.. వేళాకోళం ఆడేసినా.. వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్ని ఇన్నికావు. ఎందుకంటే.. బట్టతల పేరుతో ఒక వ్యక్తిని మరో వ్యక్తి పిలిస్తే అది లైంగిక వేధింపుగా గుర్తిస్తున్నట్లుగా వచ్చిన కోర్టు తీర్పు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

అయితే.. ఈ తీర్పు వచ్చింది ఇండియాలో కాదు ఇంగ్లండ్ లో. ఆ దేశంలోని ఒక కోర్టు బట్టతల అని పిలిచిపోడి విషయంలో కఠినంగా రియాక్టు కావటమే కాదు.. అలా పిలవటం లైంగిక వేధింపు కిందకు వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బట్టతల ఉన్న వ్యక్తిని అలా పిలవటాన్ని బ్రిటన్ కోర్టు లైగింకవేధింపుగా పేర్కొంది. ఇంగ్లండ్ లోని యోర్క్ షైర్ లోని ఒక ట్రిబ్యునల్ తాజాగా ఇచ్చిన తీర్పు హాట్ టాపిక్ గా మారింది. ఇలా పిలవటం వివక్షగా అభివర్ణించింది. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

బ్రిటిష్ బంగ్ కంపెనీలో 24 ఏళ్ల పాటు పని చేసిన టోనీ ఫిన్ ఈ మధ్యన కోర్టును ఆశ్రయించాడు. తమ ఫ్యాక్టరీ సూపర్ వైజర్ జేమీ కింగ్ తనను లైంగిక వేధింపులకుగురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇంతకూ ఆయనకు ఎదురైన లైంగిక వేధింపు ఏమంటే.. బట్టతల అని వ్యాఖ్యానించటమేనని వాపోయాడు.

ఇతగాడి పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి స్పందిస్తూ.. మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా జట్టు కోల్పోతారని.. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే బట్టతల అనే పదాన్ని ఉపయోగించటం ఒకలాంటి వివక్షే అవుతుందని పేర్కొన్నారు.

బట్టతల అంటూ తనను దుర్భాషలాడిన అధికారి తప్పు చేసినట్లుగా  బాధితుడి పిటిషన్ ను విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  బట్టతల అనే పదం లైంగికవేధింపులకు గురి చేసేదిగా పేర్కొన్నారు. మహిళల రొమ్ముల పరిమాణంపై వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఎలా అయితే లైంగిక వేధింపులుగా పేర్కొంటారో.. బట్టతల అని పిలవటం కూడా అలాంటి తీరులోనే ఉంటుందన్నారు.

ఇది లైంగిక వేధింపులకు సంబంధించిన అంశంగా స్పష్టం చేశారు. ఈ పదాన్నివాడటంఅవమానించటమేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తుందని ధర్మాసనం అభిప్రాయపడ్డారు. బాధితుడికి ఊరట కలిగించే వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం.. తప్పు చేసిన వ్యక్తి చెల్లించాల్సిన పరిహారం గురించి త్వరలో తీర్పు వెలువరించనున్నారు.
Tags:    

Similar News