పోల‌వ‌రానికి తొలిద‌శ సాయం అదిరిపోయింది

Update: 2016-12-27 04:36 GMT
ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్లుగానే నాబార్డు ద్వారా పోల‌వ‌రం ప్రాజెక్టుకు మంజూరైన‌ తొలి దశ రుణం రూ.1981 కోట్ల చెక్కును ఏపీ ప్ర‌భుత్వానికి అందజేసింది. ఢిల్లీలో జరిగిన నాబార్డు సమావేశంలో ఈ నిధులకు సంబంధించిన రూ.1981 కోట్ల చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఏపీ సీఎం చంద్రబాబు అందుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నాబార్డు నిధులు ఇవ్వ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం కావ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా  కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా ఉందని, ప్రాజెక్టులు-రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషిచేస్తున్నారని ఉమాభార‌తి ప్ర‌శంసించారు. పోలవరం నిధుల సాధన విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌ని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషించే పోలవరం ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికావాలంటే నిధులు అవసరమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు నాబార్డు ద్వారా నిధులు ఇచ్చినట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధికి అన్నిరకాలా సాయం అందిస్తున్నామని జైట్లీ తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నిధులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరవును అధిగమించొచ్చని చెప్పారు.  2018 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి ప్రపంచంలోనే అతిత్వరగా పెద్దప్రాజెక్టు పూర్తిచేసిన రికార్డును సొంతం చేసుకుంటామన్నారు. ఇప్పటివరకు 11సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించాననీ, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షిస్తున్నట్టు చెప్పారు. పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు చంద్ర‌బాబు వివ‌రించారు.  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పోలవరంపై ప్రాజెక్టు విష‌యంలో కేంద్రం చిత్త‌శుద్ధితో ఉంద‌ని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా మర్చిపోయిందని అయితే ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలో పోలవరంపై చర్చించామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండాల‌ని ఆర్డినెన్స్‌ ద్వారా తెలంగాణలో 7 మండలాలను ఏపీలో విలీనం చేశామన్నారు. ఏపీకి ఆయువుప‌ట్టు అయిన ఈ ప్రాజెక్టు విష‌యంలో కేంద్ర పూర్తి స‌హాయం అందిస్తుంద‌ని పున‌రుద్ఘాటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News