నిండు సభలో ఆమె కేసీఆర్ కు షాకిచ్చారు

Update: 2016-11-22 03:48 GMT
మేధావిగా.. మంచి వ్యూహకర్తగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరోకోణం ఉంది. బొమ్మ ఉన్న నాణెనికి బొరుసు ఉన్నట్లే.. మొనగాడు లాంటి ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ కు మరో కోణం ఏమిటంటే.. పాలనా పరంగా చేసే తప్పులు..కోర్టుల నుంచి తరచూ అక్షింతలు.. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణాలు లాంటివి చేస్తుంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. గడిచిన రెండున్నరేళ్ల కేసీఆర్ పాలనలో.. ఇలాంటి ఎదురుదెబ్బలు ఆయన చాలానే తిన్నారు. అయినా.. వాటిని లైట్ తీసుకుంటూ తాను అనుకున్న మార్గంలో మొండిగా ప్రయాణించే విలక్షణత ఆయన సొంతంగా ఆయన్ను విమర్శించే వారు తరచూ చెబుతుంటారు. తాజాగా ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఆయనకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలోని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి. అయినప్పటికీ.. వారు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు చెప్పకుండా తనదైన శైలిలో సాగిపోతున్న కేసీఆర్ కు షాకిస్తూ.. కేంద్రమంత్రి ఉమాభారతి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి గోవర్ధనరెడ్డి ఒక ప్రశ్నను సంధించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కేంద్రం దృష్టికి వచ్చాయా? సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేఆర్ ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య మండలి)లు ఆమోదం తెలిపాయా? ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతోంది? ఈ ప్రాజెక్టుకు ఎంత నీరు కేటాయించారు? ఈ ప్రాజెక్టు ఆర్థిక మనుగడ గురించి మదింపు చేశారా? లాంటి పలు ప్రశ్నల్ని ఆయన సంధించారు.

పాల్వాయి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర జలశాఖా మంత్రి ఉమాభారతి.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రం తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ సర్కారు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ తమకు సమాచారం ఇచ్చిందని.. ఈ పథకానికి సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం).. కీఆర్ ఎంబీలు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను సీడబ్ల్యూసీకి కానీ.. కేఆర్ ఎంబీకి కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. పాల్వాయి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిండు సభలో షాకిచ్చేలా సమాధానం ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News