ఉండవల్లికి కేసీఆర్ చేసిన బ్రెయిన్ వాష్ ఏమిటి?

Update: 2016-09-17 05:01 GMT
విషయం ఏదైనా సమర్థ వాదనను వినిపించే సీమాంధ్ర నేతల్లో సీనియర్ నేత.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. మాటలతో మేజిక్ చేయగల సత్తా ఆయన సొంతం. అలాంటి నాయకుడికి మరో మాటల మరాఠి బ్రెయిన్ వాష్ చేస్తే ఎలా ఉంటుంది? అది అసలు సాధ్యమేనా? అన్నది ఒక ప్రశ్న. అయితే.. ఇది నిజంగా జరిగిందంటూ విభజనకు ముందు చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. విభజన సమయంలో చోటు చేసుకున్న మొత్తం విషయాల్ని పూస గుచ్చినట్లుగా వివరంగా చెప్పుకొచ్చారు తన తాజా పుస్తకంలో. విభజన నాటి సంగతులన్నింటిని.. ‘విభజన కథ’ పేరిట ఒక పుస్తకాన్నిరాశారు. దీన్ని రేపు (ఆదివారం) సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు ఆవిష్కరించనున్నారు.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఉండవల్లి తన తాజా పుస్తకంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సమకాలీన అంశాలతో పాటు.. పలు తెర వెనుక జరిగిన అంశాల్ని వెల్లడించారు. విభజన గుట్టును తన పుస్తకం ద్వారా రట్టు చేసే ప్రయత్నం చేసిన ఉండవల్లి విభజనకు సంబంధించి 2004 నుంచి 2014 వరకూ చోటు చేసుకున్న వివిధ ఘటనల్ని తన పుస్తకంలో విపులీకరించారట.

ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఆ అంశాల్ని ఉండవల్లి మాటల్లోనే చెబితే..

అది 2005.. జులై 20. నేను ఎంపీగా వ్యవహరిస్తున్న రోజులవి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరా. అందులో అప్పటి కేంద్రమంత్రి కేసీఆర్.. అలె నరేంద్రలు ఉన్నారు. కేసీఆర్ పిలిచి తన పక్కన కూర్చొబెట్టుకున్నారు. సుమారు గంట సేపు నాతో మాట్లాడుతూనే ఉన్నారు. హైదరాబాద్ లో టేకాఫ్ అయినప్పటి నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకూ ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన చెప్పేది నేను వింటూనే ఉన్నాను. బ్రెయిన్ వాష్ అనే పదం ఎక్కువగా విన్నాను కానీ.. అదెలా ఉంటుందన్నది కేసీఆర్ పక్కన కూర్చున్నప్పుడు మాత్రం బాగా అర్థమైంది.

బహిరంగ సభల్లో..పార్టీ వేదికల మీద.. ప్రెస్ మీట్ లలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంత నష్టపోయిందో లెక్కలు చెబుతారు. కానీ.. నాతో మాత్రం ఉమ్మడి రాష్ట్రం కారణంగా కోస్తా.. రాయలసీమలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏకరువు పెట్టారు. స్కూల్ మాష్టారు లెక్కలు చెప్పినంత వివరంగా చెబుతూ.. సముద్రం వల్ల వచ్చే లాభాల్ని వివరిస్తూ.. వాటిని విశాఖపట్నం అందుకోలేకపోయిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. గోదావరి.. కృష్ణా నదుల నీరు ఎంత? ఎవరెంత వాడుకుంటున్నారు? గోదావరి జిల్లాలకు ఎంత అన్యాయం జరుగుతోంది? లాంటివి చెప్పుకొచ్చారు. ఆయన మాటల్ని వింటూ ఆయనతో నేనో మాట చెప్పా. మీ మాటలు వింటుంటే.. తెలంగాణ ఉద్యమం వదిలేసి.. ప్రత్యేకాంధ్ర ఉద్యమం మొదలుపెట్టేలా ఉన్నారే అన్నాను. దీనికి బదులు అన్నట్లుగా కేసీఆర్.. మీ దగ్గర కూడా ప్రత్యేక రాష్ట్రం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం జరగాలి. 1972 ఉద్యమంలో మీరంతా యాక్టివ్ గా పాల్గొన్నారు కదా అని అన్నారు. దీనికి సమాధానం అన్నట్లుగా.. ఆనాటి హైదరాబాద్ వేరు.. ఇవాల్టి హైదరాబాద్ వేరు. మీరు కోరుకునేది ప్రత్యేక తెలంగాణ. మాకర్థమైంది మాత్రం.. మమ్మల్ని హైదరాబాద్ వదిలి పొమ్ముంటున్నారని అన్నాను.

అయితే..ఆ ఆలోచన తెలంగాణ వారికి లేదని.. అది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు చేస్తున్న దుష్ప్రచారమని కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. అలా చెప్పగల నేర్పు కేసీఆర్ కు ఉంది. అందుకే నేను ఆయనతో మాట్లాడుతూ.. ‘‘మీరు కేంద్రమంత్రి. మీ ఆఫీసుకు అందరిని పిలిచి చెప్పండి. నాకిచ్చిన ప్రైవేటు క్లాస్ కాకుండా.. అందరికి కలిపి క్లాస్ ఇవ్వండి’ అని అన్నా. దానికి కేసీఆర్ బదులిస్తూ.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రానివ్వడని అన్నారు.

అది 2012 డిసెంబరు 27. అప్పటికే తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ.. తెలంగాణ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతల్ని సమావేశపర్చారు గులాంనబీ ఆజాద్. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏ ప్రాంతానికి చెందిన వారు.. ఏం మాట్లాడతారో తెలిసిందే కాబట్టి దానిపై చర్చ అక్కర్లేదు. ఇక్కడ మీరో విషయం చెబుతానంటూ గులాం నబి అజాద్ ఒక ఉదంతాన్ని చెప్పుకొచ్చారు.

ఒకసారి తాను పంజాబ్ ముఖ్యమంత్రితో కలిసి కారులో వెళుతున్నాం. లైట్ల వెలుగులో ఒక కుందేలు రోడ్డు మీదకు వచ్చి లైట్లను చూస్తూ నిలబడింది. కుందేలు పారిపోతుందని భావించిన డ్రైవర్ కారును ముందుకుపోనిచ్చాడు. కారు కింద పడి కుందేలు చచ్చింది. కుందేలు ఎందుకు చనిపోయిందన్న విషయాన్ని పంజాబ్ సీఎం చెబుతూ.. వచ్చిన దారిలో పరిగెత్తాలా? ముందుకు వెళ్లాలా? అనే నిర్ణయం తీసుకోవటంలో జరిగిన ఆలస్యమే కుందేలుచావుకు కారణంగా చెప్పారని.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదే తీరులో ఉన్నట్లు చెప్పారు.

అది 2013 జులై 26. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని గులాంనబీ.. దిగ్విజయ్ లు ముఖ్యమంత్రి కిరణ్.. పీసీసీ చీఫ్ కు చెప్పేశారు. ఏపీ భవన్ లో సీఎం కిరణ్ ను కలిశాను. ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. నేను.. కేవీపీ మీటింగ్ నుంచి బయటకు వచ్చి మౌనంగా కూర్చున్నాం. కాంగ్రెస్ కు జీవితాంతం నమ్మినబంటులా వ్యవహరించాను.. ఇప్పుడు అదే కాంగ్రెస్ మనల్ని నమ్మటం లేదా? అన్న భావన. అప్పుడే గులాంనబీ ఫోన్ చేశారు. తెలంగాణ ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని అనుకోకండి అని చెప్పా. తెలంగాణపై నిర్ణయం తీసేసుకున్నాక.. ఇప్పుడు అభిప్రాయం అడిగితే ఎలా అని ప్రశ్నించా.

అది 2013 సెప్టెంబరు 8. జైపాల్ నివాసం. ఆయనింటికి వెళ్లా. 1969సమయంలో సమైక్యవాదిగా నిలిచిన మీరు ఇప్పుడిలా అని అడిగా. దీనికి సమాధానంగా జైపాల్ మాట్లాడుతూ.. ఒకసారి ప్రకటన ఇచ్చాక వెనక్కి వెళితే తెలంగాణ ప్రజలు ఆమోదించరన్నారు. మరి.. ఆంధ్రా మాటేమిటి? వారిని కూడా కాంగ్రెస్ సంతృప్తి పర్చాలి కదా అని అన్నాను.

దీనికి బదులుగా జైపాల్.. ఇప్పుడు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నా ఏపీలో కాంగ్రెస్ కు లబ్ది చేకూరదని.. తెలంగాణలోనూ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని గట్టిగా చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానంలో చిన్న మార్పు జరిగినా.. అంతర్యుద్ధం స్థాయి ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జైపాల్ నోట నేను అంత తీవ్రమైన మాట వస్తుందని ఊహించలేదు. సార్.. 1969 నాటి ఉద్యమం కంటే తీవ్రమైంది కాదు. 2008లో కూడా మీరు తెలంగాణ ఏర్పాటు సరికాదన్నారు. విభజనే ఈ సమస్యకు పరిష్కారమని నేను అంటే.. మీరు నన్ను తీవ్రంగా మందలించారు. ఇలాంటి మీలో ఈ మార్పేంటి సార్? అని ప్రశ్నించా.

దానికి జైపాల్ ఇచ్చిన సమాధానం.. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాత వాతావరణం మొత్తం మారిపోయింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ కానీ.. ప్రభుత్వం కానీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇచ్చేసిన రాష్ట్రాన్ని ఆంధ్రావారు ఆపేస్తున్నారన్న నమ్మకం తెలంగాణ ప్రాంతంలో బలపడింది. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత నేనే కాదు.. ఏ తెలంగాణ నాయకుడైనా ప్రత్యేక తెలంగాణను బలపర్చాల్సిందే. 2009 ఎన్నిలకు ముందు తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తున్నట్లు అసెంబ్లీలోనే వైఎస్ ప్రకటించారు. ఇప్పుడు ఒప్పుకోమని కాంగ్రెస్ వాళ్లం మనమే అంటే ఎలా? దాన్ని నువ్వు ఎలా సమర్థిస్తావు? అని చెప్పారు. ఈ సందర్భంగా కాసేపు చర్చ నడిచింది. చివర్లో జైపాల్.. ‘ఇక ఆ దశలన్నీదాటిపోయాయి. మనమిద్దరం ఎంత వాదులాడుకున్నా ఫలితం ఉండదు’ అని తేల్చి చెప్పారు.

అది 2013 సెప్టెంబరు 19. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో మరో సమావేశం జరుగుతోంది. దీనికి వచ్చిన దిగ్విజయ్ రావటంతోనే.. రాష్ట్ర విభజన అంశంపై చర్చ అనవసరం. ఇంకేమైనా ఉంటే చెప్పాలని సీరియస్ గా అన్నారు. ఆ రోజు నేను ఎక్కువగా మాట్లాడాను. అయ్యా.. మీరు విభజనకు డిసైడ్ అయ్యారు. అది చిదంబరం రాజ్యసభలో చెప్పినట్లు చేస్తారా? లేక. ఏపీకి వేరే పద్దతి తయారు చేస్తారా? అని అడిగా.

ఏ పద్ధతిలో జరగాలో.. అలాగే జరుగుతుందన్నారు. ఇదే మాట బయట ప్రెస్ మీట్ పెడితే సీమాంధ్రలో ఉద్యమం ఆగిపోతుందని అన్నా. ఈ సందర్భంగా నేనో మాట దిగ్విజయ్ తో అన్నా.. మీరు సీఎంగా ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ లో విభజన ఎలా జరిగిందో.. ఇప్పుడు ఏపీలో విభజన కూడా అలాగే జరుగుతుందని చెబుతూ.. ఈ విషయంపై మళ్లీ సమావేశం కానక్కర్లేదన్నా. దీనికి దిగ్విజయ్ కు కోపం నషాళానికి అంటింది.  మధ్యప్రదేశ్  విభజనకు అసెంబ్లీ తీర్మానం తర్వాతే ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే.. ఏపీలో కూడా అసెంబ్లీ తీర్మానంతో ప్రక్రియ ప్రారంభమవుతుందని నేను చెప్పినట్లు ఆయనకు అర్థమైంది. అరుణ్ నువ్వొక తెలివైన బ్రాహ్మణుడివి. నేనొక మూర్ఖపు ఠాకూర్ ను. నీకు నేనెక్కడ సరిపోతాను. విభజన జరగటం ఖాయం. మీ మొండితనం వల్ల మీ ప్రాంతం నష్టపోతుందన్నారు.
Tags:    

Similar News