బాబు హిట్లర్..ముసోలినీ అయితే ముద్రగడ దీక్ష చేసేవారా?

Update: 2016-06-28 16:50 GMT
దివంగత మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన నేతల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. అప్పటివరకూ అందరికి తెలివైన వ్యక్తిగా.. మంచి మాటకారిగా తెలిసినప్పటికీ.. ఉండవల్లిలోని టాలెంట్ మొత్తం నాటి ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి అర్థమయ్యేలా చేయటంలో వైఎస్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. తన మాటలతో అందరిని విస్మయానికి గురి చేసి.. తన టాలెంట్ మొత్తాన్ని పలు అంశాల్లో ప్రదర్శించటం.. వైఎస్ మరణం తర్వాత ఒక్కసారిగా ఆయన ప్రభ పడిపోవటం తెలిసిందే.

ఇంత మాటకారి.. లా పాయింట్లు తీసే పెద్దమనిషి.. రాష్ట్ర విభజన సమయంలో అయ్యవారి తీరు చూసిన సీమాంధ్రులు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఏపీకి జరిగిన నష్టంపైనా గొంతు విప్పటానికి నానా తంటాలు పడ్డారు. అప్పుడప్పుడు వాయిస్ ఓపెన్ చేసినా.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేని పరిస్థితి. విభజన కారణంగా సీమాంధ్రకు నష్టం జరిగిందంటే.. దానికి ఉండవల్లి లాంటోళ్లు బలమైన వాదనను వినిపించకపోవటమే.

అలాంటి పెద్దమనిషి 2014 ఎన్నికల తర్వాత నుంచి క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించటం లేదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి.. ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీక్ష సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హిట్లర్.. ముసోలినీలా వ్యవహరించారన్నారు. హిట్లర్.. ముసోలిని కాలంలో ప్రజా ఉద్యమాల్ని నిర్వీర్యం చేసి.. అణిచేసే వారన్నారు. ముద్రగడను 13 రోజులు ఆసుపత్రిలో నిర్బంధించి.. మానసికంగా బలహీనం చేయాలని చూసినట్లుగా ఆరోపించారు.

ఇన్ని మాటలు చెప్పిన పెద్ద మనిషి.. ముద్రగడ ఏ విషయం మీద దీక్ష చేశారు? అన్న విషయం మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుండేదేమో? నిజంగానే చంద్రబాబు కానీ హిట్లర్.. ముసోలిని అయి ఉంటే.. ముద్రగడ లాంటి వ్యక్తి ఉద్యమం చేసేవారా? అన్నది ప్రశ్న. ఒకవేళ చేసినా.. అణగదొక్కేయాలి కదా? కానీ.. అందుకు భిన్నంగా ముద్రగడ కోరుకున్నట్లే జైల్లో ఉన్న నిందితుల్ని బెయిల్ మీద తీసుకొచ్చి.. ఆయన కోరుకున్నట్లే ఆసుపత్రిలో ఆయన ముందు నిలబెట్టిన తర్వాతే దీక్ష విరమించిన విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ.. బాబు కానీ ఉండవల్లి చెప్పినట్లుగా అంత పెద్ద నియంత అయితే.. ముద్రగడ డిమాండ్లను తీర్చు కదా? మరి.. లాజిక్ లేకుండా ఉండవల్లి ఎందుకు మాట్లాడుతున్నట్లు? రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఫ్లో కాస్త పట్టు తప్పినట్లుగా లేదూ..?
Tags:    

Similar News