చంద్రబాబుకు చీమకుట్టినట్లయినా లేదా?

Update: 2016-08-03 10:08 GMT
ఆంధ్రప్రదేశ్‌ ను చిన్నచూపు చూస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడినా చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఎక్స్ - వై - జడ్.. ఏ - బీ - సీ… ఇలా ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రం డబ్బులు అడిగితే ఇస్తూ పోవడం పద్ధతి కాదని, డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నట్లుగా జైట్లీ మాట్లాడారని ఉండవల్లి మండిపడ్డారు.  అంతమాట అన్నా కూడా చంద్రబాబుకు చీమ కుట్టినట్లు లేదన్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అందరూ సమర్థిస్తున్నా బీజేపీ నేతలు మాత్రం బిహార్ - ఒడిషా లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయంటూ దాటవేస్తున్నారని ఆరోపించారు.  పార్లమెంటులో జైట్లీ ప్రకటన తర్వాత తొలిరోజు రక్తం మరిగిందన్న చంద్రబాబు అప్పుడే ఎందుకు చల్లబడ్డారని ప్రశ్నించారు. మోడీ చేసిన మోసానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికల సమయాల్లో మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆకు వచ్చి ముల్లు మీద పడ్డా ముల్లు వచ్చి ఆకు మీద పడ్డ ఆకుకే ఇబ్బంది అని మంగళవారం ప్రెస్‌ మీట్లో చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్‌  ఎంతమాత్రం ఆకు కాదని..  కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఆంధ్రప్రదేశ్‌ కు చిరిగేది ఏమీ ఉండదని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచితేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ఆసక్తికర కామెంట్లు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి రాజ్యసభలో మంగళవారం కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్‌ విషయంలో ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ ఆదేశాలను 2016 జూలై 7వ తేదీ వరకు అభయన్స్‌ లో ఉంచినట్లు చెప్పారని... ఆ తేదీ ముగిసింది కాబట్టి ఇప్పుడు ‘‘స్టాప్ వర్క్’’ ఆర్డర్ అమల్లోకి వస్తుందని ఉండవల్లి అన్నారు.  కాబట్టి పోలవరం ప్రాజెక్టు పనులు ఆపివేయాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన అయిదు రోజుల కిందట ఒడిశా ఎంపీ - ప్రముఖ నటుడు అనుభవ్ మొహంతి అడిగిన ప్రశ్న.. పోలవరం విషయంలో ఆయన ప్రస్తావించిన అంశాలను కూడా ఉండవల్లి గుర్తు చేశారు. ఆయనకు జైట్లీ ఇచ్చిన సమాధానం కూడా ఉండవల్లి చెప్పారు.

కాగా పోలవరం అంశం సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు కేంద్రం ఆ ప్రాజెక్టుకు నిధులు ఎలా రిలీజ్ చేస్తుందని అనుభవ్ మహంతి అయిదు రోజుల కిందట రాజ్యసభలో ప్రశ్నించారు. అంతేకాదు.. బీజేడీకి చెందిన రాజ్యసభ - లోక్ సభ ఎంపీలంతా అంతకుముందు ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఒడిశాకు అన్యాయం చేయబోమని ఆయన చెప్పిన విషయాన్ని అనుభవ్ సభలో గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని కూడా అనుభవ్ ఆ రోజు ప్రస్తావించారు. తమకు ఎగువన ఉన్న బెంగాల్ - దిగువ రాష్ట్రం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ మధ్యలో ఉన్న ఒడిశాను ఎలా మరిచిపోతారని కూడా ఆయన సభలో నిలదీశారు. ఆయనకు ప్రశ్నకు సమాధానంగా జైట్లీ మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్టును చట్టంలో పెట్టారు కాబట్టి తాము జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాల్సిందేనని... అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు  ఆ చట్టాన్ని కొట్టివేస్తే అప్పుడు తాము కూడా పోలవరంపై వెనక్కు తగ్గుతామని అరుణ్ జైట్లీ చెప్పారు. దాని ప్రకారం పోలవరం నిర్మాణంపై అనుమానాలు కలుగుతున్నాయని ఉండవల్లి అన్నారు.   దీనిపై చంద్రబాబు నోరు విప్పకపోతే నష్టపోతామని ఉండవల్లి అన్నారు.
Tags:    

Similar News