బీజేపీతో దోస్తీకి... బాబు నో చెప్పేస్తారా?

Update: 2017-12-28 08:21 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ... మిత్ర‌ప‌క్షాలుగా కొన‌సాగుతున్న పార్టీలు. ఎన్డీఏలో బీజేపీ కీల‌క భాగ‌స్వామిగా ఉండ‌గా, టీడీపీ కూడా ఓ ముఖ్య‌మైన భాగ‌స్వామిగానే ఎన్డీఏ కూట‌మిలో కొన‌సాగుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య బంధం గ‌తంలో కంటే ఇప్పుడే మ‌రింత బ‌లంగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు. ఎందుకంటే... కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారులో టీడీపీ భాగ‌స్వామిగా కొన‌సాగుతుండ‌గా - ఏపీలో టీడీపీ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వంలో బీజేపీ భాగ‌స్వామిగా ఉంది. ఇంత‌టి బంధం ఈ రెండు పార్టీల మ‌ధ్య ఉంటే... బీజేపీకి బాబు నో చెప్పేస్తారా? అని అడిగితే ఏం స‌మాధానం వ‌స్తుంది. అది అంత ఈజీ కాద‌నే ఆన్స‌రే వ‌స్తుంది. అయితే ఇప్పుడు ఆ మాట వినిపించ‌డం లేదు. ఏమో... బీజేపీతో మైత్రికి చంద్ర‌బాబు నో చెప్పేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇందుకు దారి తీసే కార‌ణాలు చాలానే ఉన్నాయ‌ని కూడా స‌రికొత్త విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

కేంద్ర కేబినెట్‌ లో ఇద్ద‌రు టీడీపీ మంత్రులున్నా... విభ‌జ‌న క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఏపీకి ఒరిగింది శూన్య‌మేన‌ని చెప్పాలి. అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌ట్లుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల్సిన కేంద్రం... అందుకు స‌సేమిరా అనేసింది. అంతేకాకుండా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రా చేసుకుని ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పించిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఆ త‌ర్వాత ప్ర‌తి విష‌యంలోనూ ఏపీకి తీర‌ని అన్యాయం చేస్తూ వెళుతున్న మోదీ స‌ర్కారు... ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ప్ర‌క‌టించినా... నిధుల విడుద‌ల‌లో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. అంతేకాకుడా పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాన్ని త‌నిఖీల పేరిట అగ‌మ్య గోచ‌రంగా మార్చేస్తోంద‌న్న కొత్త విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కార‌ణంగా ఈ ప్రాజెక్టు నిర్దేశిత స‌మ‌యంలోగా పూర్తి అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో బాబు కొత్త త‌ర‌హా వ్యూహాన్ని అమ‌లు చేసేందుకు దాదాపుగా సిద్ధ‌మైపోయార‌న్న వార్త‌లు కూడా వినిపించాయి.

అదే స‌మ‌యంలో వెలువ‌డ్డ గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బాబు... ఆ వ్యూహాన్ని కాస్తంత ప‌క్క‌న‌బెట్టిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఎందుకంటే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ వ‌రుస‌గా ఆరో ప‌ర్యాయం విజ‌యం సాధించింది మ‌రి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దూసుకుపోతున్న వైనాన్ని చూసిన చంద్ర‌బాబు... బీజేపీకి గుజ‌రాత్‌ లో పెద్ద దెబ్బ త‌ప్ప‌దేమోన‌న్న డౌటైతే వ‌చ్చిన‌ట్లుగానూ స‌మాచారం. ఈ కార‌ణంగానే ఆ పార్టీతో తెగ‌దెంపులు చేసుకునే దిశ‌గానే చంద్ర‌బాబు యోచించార‌ని కొన్ని సెక్ష‌న్ల‌లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ గుజ‌రాత్ పోల్స్ మోదీ వైపే మొగ్గ‌డంతో చంద్ర‌బాబు త‌న వ్యూహాన్ని అటకెక్కించిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే ఇప్పటికే స‌ద‌రు వ్యూహాన్ని పూర్తి స్థాయిలో ర‌చించేసిన చంద్ర‌బాబు ఎప్పుడో అప్పుడు దానిని బ‌య‌ట‌కు తీస్తార‌ని - బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుంటార‌ని కూడా చాలా మంది అంచ‌నా వేస్తున్నారు.

మొన్న‌టి గుజ‌రాత్ ఎన్నిక‌ల మాదిరిగా వ‌చ్చే ఏడాది... 2019 ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా ఏడాది ముందు దేశంలోని ఆరు రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ జాబితాలో ద‌క్షిణాది రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లో కూడా ఉంది. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మిపాలైతే... చంద్రబాబు బీజేపీతో దోస్తీకి క‌టీఫ్ చెప్ప‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. వ‌చ్చే ఏడాది ఆరు రాష్ట్రాల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను అంద‌రూ 2019 ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గానే భావిస్తున్నారు. ఈ ఆరు రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు గెలిచే పార్టీలకే 2019 ఎన్నిక‌ల్లో గెలిచే ఛాన్సు ఉంటుంద‌న్న వాద‌న ఉంది. ఈ లెక్క‌న వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఆరు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడితే... ఆ పార్టీకి బాబు గుడ్ బై చెప్ప‌డం ఖాయ‌మేన‌ట‌. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ - రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్... 2019 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని బీజేపీకి గెలుపు అవ‌కాశాలు లేవ‌ని భావిస్తే... ఆ పార్టీతో చంద్ర‌బాబు తెగ‌దెంపులు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్పారు.
Tags:    

Similar News