హెరిటేజ్ సంస్థా తెలంగాణ‌కే ప‌న్ను క‌డుతోంది!

Update: 2018-01-23 11:41 GMT
నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ ఏపీ అభివృద్ధి మిన‌హా మ‌రింకేమీ త‌న‌కు ప‌ట్ట‌ద‌న్న‌ట్లుగా మాట‌లు చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట‌ల‌కు.. చేత‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఎంత‌న్న విష‌యాన్ని విప్పి చెప్పారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌. ఏపీ ప‌ట్ల బాబుకున్న ఆందోళ‌న‌.. బాధ‌.. వేద‌న‌ను త‌ర‌చూ ప్రెస్ మీట్లు.. ప్రెస్ నోట్ల‌తో వ్య‌క్తం చేసే వైనం చూసిన‌ప్పుడు.. అయ్యో చంద్ర‌బాబు ఎంత‌గా ఫీలైపోతున్నారే అనుకునే వారు చాలామంది క‌నిపిస్తారు.

మ‌రి.. ఏపీ మీద అంత ప్రేమ ఉన్న‌ప్పుడు.. తాను పాలిస్తున్న ఏపీకి కొత్త జ‌వ‌స‌త్వాలు తెచ్చేందుకు వ్య‌క్తిగ‌తంగా తాను.. త‌న కుటుంబం ఏమైనా చేయ‌గ‌లిగిందా? అంటే లేద‌నే చెప్పాలి. విభ‌జ‌న త‌ర్వాత చాలామంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోయారు. మ‌రికొంద‌రు సీమాంధ్రులైతే.. ఏపీకి ఉన్న ఆర్థిక దుస్థితి నేప‌థ్యంలో తెలంగాణ నుంచి న‌డిపే ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సుల్లో తిర‌గ‌టం.. కాస్త ఛార్జి ఎక్కువైనా ఫ‌ర్లేదు..ఆ డ‌బ్బులు ఏపీకే వెళ‌తాయ‌న్న భావ‌న కొంద‌రు వ్య‌క్తం చేయ‌టం క‌నిపిస్తుంది.

స‌గ‌టు జీవులు ఏపీ కోసం అంత‌గా ఆత్ర‌ప‌డుతున్న వేళ‌.. ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబు మ‌రెంత‌గా ఫీల్ కావాలి? త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను ప‌ణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానంటూ కోత‌లు కోసే ఆయ‌న మాట‌ల్లోని డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టారు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌.

హైద‌రాబాద్ నుంచి ఐటీ కంపెనీలు కోస్తాకు ఎందుకు వ‌స్తాయ‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. కార్పొరేట్ కంపెనీల‌న్నీ బెంగ‌ళూరు.. హైద‌రాబాద్‌ లోనే ఉన్నాయ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. చివ‌ర‌కు హెరిటేజ్ ప్రెష్ ప్ర‌ధాన కార్యాల‌యం కూడా హైద‌రాబాద్‌ లోనే ఉంద‌ని.. ఆ కంపెనీ సంపాద‌న మీద క‌ట్టాల్సిన ప‌న్నును తెలంగాణ రాష్ట్రానికే  చెల్లిస్తోంద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్ర‌మే త‌మ కార్యాల‌యాన్ని విజ‌య‌వాడ‌కు మార్చుకున్నట్లు చెప్పారు. ఎవ‌రూ హైద‌రాబాద్ ను వ‌దిలిపెట్టి రావ‌టం లేద‌న్న ఆయ‌న‌.. సినిమా వాళ్లు అక్క‌డే ఉన్నార‌న్నారు.

రాష్ట్ర అభివృద్ధిపై చంద్ర‌బాబు లెక్క‌లు స‌రిగా లేవ‌ని.. ఆయ‌న‌వ‌న్నీ కాకి లెక్క‌లుగా అభివ‌ర్ణించారు. జీడీపీ పెంచామంటూనే రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని చెబుతున్నార‌ని త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్రానికి న్యాయం చేయ‌కుంటే సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉండ‌వ‌ల్లి విమ‌ర్శిస్తూ.. కేంద్రంపై కాకుండా ఎవ‌రిపై సుప్రీంకోర్టుకు వెళ‌తారు? అని ప్ర‌శ్నించారు. సీఎం ప‌క్క‌నే కూర్చొని మ‌రీ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుక‌ని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మ‌న్ వ్యాఖ్యానించ‌టంపై దారుణ‌మ‌న్నారు. రౌతు మెత్త‌నోడైన‌ప్పుడు గుర్రం రెండు కాళ్ల మీద‌నే ప‌రిగెడుతుంద‌ని ఊరికే అన‌లేదు మ‌రి.
Tags:    

Similar News