ఉండ‌వ‌ల్లి మాట‌!..జ‌న‌సేన‌పై క్లారిటీ ఇవ్వ‌లేను!

Update: 2018-01-24 10:33 GMT
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే... మొన్న క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆ పార్టీపై ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశాన‌ని - ఇక‌పై సినిమాలు చేసేది లేద‌ని తేల్చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... ఇక రాజ‌కీయ‌మే త‌న ప్ర‌ధాన రంగ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అయితే క‌రీంన‌గ‌ర్ మీడియా స‌మావేశంలో ఆయ‌న నోట నుంచి ఈ మాట‌తో పాటు చాలా మాట‌లే వినిపించాయి. అధికారంలో ఉన్న పార్టీలకు ఇబ్బందులుంటాయ‌ని - వాటిని అర్థం చేసుకున్న కార‌ణంగానే తాను ఆ పార్టీల‌ను ప్ర‌శ్నించ‌డం లేద‌ని చెప్పిన ప‌వ‌న్‌... తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న‌... 25 ఏళ్ల పాటు రాజ‌కీయాల్లో ఉందామ‌నే జ‌న‌సేనను స్థాపించాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఆ వెనువెంట‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన ఎక్క‌డ బ‌లంగా ఉంటుందో అక్క‌డ మాత్ర‌మే త‌న పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతార‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అక్క‌డితో అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆగి ఉంటే బాగుండేదేమో. ఇప్ప‌టికిప్పుడు అధికారంలోకి రావ‌డం త‌న అజెండా కాద‌ని ప్ర‌క‌టించి ప‌వ‌న్ క‌ల్యాణ్ విశ్లేష‌కుల‌తో పాటు త‌న అభిమానులను - పార్టీ శ్రేణుల‌ను కూడా షాక్‌ కు గురి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అధికారం కోసం కాక‌పోతే... రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌స్తారు? అధికారం ద‌క్క‌క‌పోతే... తాను అనుకుంటున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు ఎలా అందిస్తారు. అధికారం లేకుండా ప్ర‌జ‌ల‌కు ఏ మేర సేవ చేస్తారు? అన్న ప్ర‌శ్న‌ల‌ను ఆయ‌న లేవ‌నెత్తార‌నే చెప్పాలి. మొత్తంగా క‌ల‌గూర గంప లాంటి కామెంట్లు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్... త‌న పార్టీ భ‌విష్య‌త్తుపైనే అనుమానాలు రేకెత్తేలా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే విష‌యంపై చాలా మంది రాజ‌కీయ నేత‌లు చాలా ర‌కాలుగా మాట్లాడుతున్నా... ఉన్న విష‌యాన్ని ఉన్న‌ట్లుగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టే నేత‌గా పేరున్న సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, మాజీ పార్ల‌మెంటు స‌భ్యులు ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్... ప‌వ‌న్ వైఖ‌రిపై త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించారు. అస‌లు జ‌న‌సేన‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ కైనా క్లారిటీ ఉందా? అన్న కోణంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఉండ‌వ‌ల్లి... జ‌న‌సేన‌పై జ‌నాల్లో ఉన్న అనుమానాల‌ను మ‌రింత‌గా పెంచేశార‌నే చెప్పాలి.

నిన్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పిన ఉండ‌వ‌ల్లి... జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న రాగానే అంతెత్తున ఎగిరిప‌డ్డారు. అయినా జ‌న‌సేన‌ - ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ల‌పై ఉండ‌వ‌ల్లి ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే.. *జ‌న‌సేన మీద నేనైతే క్లారిటీ ఇవ్వ‌లేను. ఆ పార్టీ మీద ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చిన రోజున ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ నా అభిప్రాయం చెబుతా. ఆయ‌న చెబుతున్నారు. నేను నేర్చుకోవాలి. పాతికేళ్లు ఉంటాన‌ని పార్టీ పెట్టాను - ఎక్క‌డ బ‌లంగా ఉంటే అక్క‌డే పోటీ చేస్తాను అని ప‌వ‌న్‌ చెప్పారు. ఇమ్మిడియ‌ట్‌ గా ప‌వ‌ర్ లోకి రావ‌డం నా అజెండా కాదు అని చెప్పి ఆయ‌న వ‌స్తున్నారు. నా అజెండా ఏమిటీ అని ఆయ‌న ప్ర‌క‌టించిన రోజున దానిలో లోటుపాట్లు ఏమిటి అన్న దానిపై మ‌నం చ‌ర్చించుకోవ‌చ్చు. ఆయ‌న ప్ర‌క‌టించ‌కుండా నేనెలా ప్ర‌క‌టిస్తాను. సీపీఎం మీటింగ్ పెడితే వ‌చ్చాను. వైసీపీ పెడితే వ‌చ్చాను. జ‌న‌సేనను పెట్ట‌మ‌నండి వ‌చ్చేస్తాను* చాలా విస్ప‌ష్టంగా ఉండ‌వ‌ల్లి జ‌న‌సేన‌పై త‌న‌దైన శైలిలో కామెంట్లు సంధించారు. మొత్తంగా ప‌వ‌న్‌ కు రాజ‌కీయంగా అవ‌గాహ‌న లేద‌ని - ఆయ‌న దారి ఎటు వెళుతుందో కూడా తాను చెప్ప‌లేన‌ని కూడా ఉండ‌వ‌ల్లి కాస్తంత క్లారిటీగానే మాట్లాడేశారు. మ‌రి ఈ కామెంట్ల‌పై జ‌న‌సేన ఎలా స్పందిస్తుందో చూడాలి.


Tags:    

Similar News