ఉండవల్లి సంచలనం... రాజధాని రైతులది త్యాగం కాదంతే

Update: 2020-02-06 10:44 GMT
ఏపీలో ప్రస్తుతం ఎడతెగని చర్చగా మారిపోయిన రాజధాని వ్యవహారం పై సీనియర్ రాజకీయవేత్త, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరుల మధ్య సారవంతమైన భూముల్లో అమరావతి పేరిట రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటిస్తే... ఇప్పుడు సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పేరిట రాజధానిని విశాఖకు తరలిస్తున్న వైనాన్ని కూడా తప్పుబట్టిన ఉండవల్లి... అప్పుడు చంద్రబాబు చేస్తున్న తప్పునే... ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాజధాని కోసం సారవంతమైన 33 వేల ఎకరాల భూములను త్యాగం చేశామని చెబుతున్న రాజధాని రైతుల వాదన కూడా ముమ్మాటికీ తప్పేనని కూడా ఉండవల్లి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. కేవలం ఈ వ్యాఖ్యలు చేసి అలా వదిలేయని ఉండవల్లి... ఈ వ్యాఖ్యలకు తనదైన శైలి వాదనలను కూడా వినిపించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం లో గురువారం ఏర్పాటు చేిసన మీడియా సమావేశంలో రాజధాని వ్యవహారంపై సవివరంగా మాట్లాడిన ఉండవల్లి... రాజధాని అమరావతి మొత్తం కులం కార్డు మీదనే తిరుగుతోందని చెప్పారు. అమరావతి పేరిట రాజధానిని ప్రకటించిన చంద్రబాబు... తనకు, తన సామాజిక వర్గానికి మాత్రమే లబ్ధి చేకూరేలా వ్యవహరించారని వైసీపీ ఆరోపిస్తుంటే... తమ కులాన్ని దెబ్బ తీసేందుకే జగన్ రాజధానిని విశాఖకు తరలిస్తోందని టీడీపీ చేస్తున్న వాదనను వినిపించిన ఉండవల్లి... ఈ నేపథ్యంలో రాజధాని వ్యవహారం మొత్తం కులం కార్డుపై సాగుతున్నట్టే కదా అంటూ అటు వైసీపీకి, ఇటు టీడీపీకి చురకలు అంటించారు. ఇక 33 వేల ఎకరాల్లో సువిశాల రాజదానిని ఏర్పాటు చేయడం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏపీకి సాధ్యం కాదని ఉండవల్లి తేల్చేశారు. అయితే విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల వికేంద్రీకరణ సాధ్యమన్న జగన్ వాదన కూడా సరికాదని కూడా ఆయన చెప్పారు. మధ్యే మార్గంగా ఇటు అమరావతి కాకుండా, అటు విశాఖ కాకుండా విజయవాడ నో, లేదంటే గుంటూరు నో రాజధాని చేసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

ఇక అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ 50 రోజులుగా నిరసనలు తెలుపుతున్న రాజధాని రైతులు... తాము రాజధాని కోసం తమ భూములను త్యాగం చేశామని చెబుతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యం లో ఈ విషయం పై నోరు విప్పిన ఉండవల్లి... అసలు రాజధాని రైతులు చేసింది త్యాగమే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు, అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్య కుదిరింది పక్కా రియల్ ఎస్టేట్ ఒప్పందమేనని కూడా ఉండవల్లి కుండబద్దలు కొట్టేశారు. రాజధాని నిర్మాణం కోసం రైతులేమీ ఉచితంగా భూములు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఉండవల్లి... తమ భూములకు పరిహారంగా రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్లను తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. అంటే... ఈ వ్యవహారంలో పరస్పర లబ్ధి ఉన్నది తప్పించి రైతుల త్యాగం ఎక్కడుందని కూడా ఉండవల్లి అదిరేటి లాజిక్ లాగారు. అయితే ఇప్పుడు రాజధాని ని తరలించాలని యత్నిస్తున్న జగన్... రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ఓ కొలిక్కి తెచ్చిన తర్వాతే ముందుకు సాగాల్సి ఉందని అభిప్రాయ పడ్డ ఉండివల్లి... అప్పటిదాకా జగన్ వేసే ప్రతి అడుగు కూడా నిరుపయోగమేనని తేల్చేశారు.


Tags:    

Similar News