మంత్రి నారాయణ ఆస్తులపై ఉండవల్లి యుద్ధం

Update: 2016-08-29 08:19 GMT
దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలందరిలోనూ అత్యంత సంపన్నుడిగా ఏపీ పురపాలక మంత్రి పి.నారాయణ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన మంత్రి అని తేలింది. తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మంత్రి నారాయణ సంపాదనపై లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. తనకు సొంతంగా రూ. 474 కోట్ల ఆస్తులు ఉన్నట్లు స్వయంగా నారాయణే ప్రకటించారని, అదంతా ఎలా సంపాదించారో లెక్కలు చెప్పాలని ఉండవల్లి కోరుతున్నారు.  ఏ శుభకార్యం ప్రారంభించినా 'నారాయణ' అంటూ ప్రారంభిస్తాం కాబట్టి.. ఆస్తుల వివరాలు వెల్లడించడం కూడా నారాయణే ప్రారంభించాలని అన్నారు. పనిలో పనిగా చంద్రబాబును కూడా ఇందులోకి లాగారు... చంద్రబాబుకు నారాయణ కుడిభుజం వంటివారని అంటూ చంద్రబాబు పదేపదే సింగపూర్ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నల్లధనం దాచుకోవడానికి అత్యంత సేఫ్ గా ఉండే దేశాల్లో సింగపూర్ ది నాలుగో స్థానమని...అలాంటి వ్యవహారాలు ఉన్నందునే సీఎం పదేపదే సింగపూర్ వెళ్తున్నారన్నట్లుగా ఉండవల్లి మాట్లాడారు.

అమరావతి కుంభకోణంలో మంత్రి నారాయణే సూత్రధారని ఉండవల్లి ఆరోపించారు. అంతా ఆయన చేతుల మీదుగానే జరిగింది కాబట్టి ప్రధాన పాత్ర ఆయనదేనని ఆరోపించారు.  నారాయణ తన ఆస్తుల లెక్కకలను రెండు వారాల్లోగా వెల్లడించకపోతే తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఉండవల్లి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు కూడా మాట్లాడితే తాను నిప్పు అంటారని, ఆయన ఎంత నిప్పో రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే అంతా చూశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ రెండేళ్లలో ఏపీకి ఏమీ చేయలేదని... పుష్కరాలు నిర్వహించడం తప్ప ఆయన ఏమీ చేయలేదని ఉండవల్లి ఆరోపించారు.

నారాయణ వ్యాపారాలు ఏమిటి... ఆయన ఆదాయ మార్గాలేమిటన్నది చెప్పాలని డిమాండ్ చేశారు. సొసైటీలకు వేల కోట్ల నిధులు ఉండొచ్చు గానీ, ఆ సొసైటీలను నడిపేవారికి వేలకోట్లు ఉండటానికి వీలుండదని అన్నారు. వీళ్లంతా సొసైటీ డబ్బులను సొంత డబ్బులా వాడేసుకుంటున్నారని ఉండవల్లి ఆరోపించారు. సొసైట చట్ట ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలు నడపాలని ఉండవల్లి అన్నారు. ఇంతకుముందెన్నడూ నారాయణను డైరెక్టుగా టార్గెట్ చేయని ఉండవల్లి ఇప్పుడు ఆయన ఆస్తుల వ్యవహారంపై మండిపడుతుండడంతో నారాయణకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఉండవల్లి గత చరిత్ర అందుకు బలం చేకూరుస్తోంది.  గతంలో రామోజీ వంటి దిగ్గజాన్ని కూడా మార్గదర్శి వ్యవహారంలో ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన ఉండవల్లి ఇప్పుడు నారాయణపై కేసులు వేస్తే ఆయనకు ఇబ్బందులు గ్యారంటీ అని తెలుస్తోంది.
Tags:    

Similar News