బీజేపీ ఉడికిపోయే కామెంట్లు చేసిన ఉండవల్లి!

Update: 2022-05-24 09:30 GMT
అన్ని అంశాలపై అపార పరిజ్ఞానం, పట్టు, వాగ్ధాటి ఉన్న నేత.. ఉండవల్లి అరుణ్ కుమార్. రాజమండ్రి నుంచి 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండతో ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు మార్గదర్శ చిట్ ఫండ్ విషయంలో ముచ్చెమటలు పట్టించారు. అలాంటి ఉండవల్లి 2014 తర్వాత రాష్ట్ర రాజకీయాలకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. అయితే అప్పుడప్పుడు వివిధ రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్మోహమాటంగా వెల్లడిస్తున్నారు. వివిధ యూట్యూబ్ చానళ్లకు ఆయన ప్రధానంగా తన అభిప్రాయాలను వివరిస్తున్నారు.

తాజాగా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ బీజేపీపై నిప్పులు చెరిగారు. అన్ని రంగాల్లో విఫలమయిన బీజేపీ మతం విషయంలో మాత్రం విజయం సాధించిందని ఉండవల్లి ఎద్దేవా చేశారు. అన్ని మతాల మధ్య చిచ్చు పెడుతూ మత రాజకీయాలు చేస్తోందని బీజేపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీది సెక్యులరిజం.. కమ్యూనిస్టులది సోషలిజం కాగా బీజేపీది మాత్రం హిందూయిజమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని.. ఇతర దేశాల వాళ్లు కూడా భారతీయ సంప్రదాయాలను అనుసరిస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. కానీ మనం మాత్రం అసలు ఎటుపోతున్నామో తెలియడం లేదన్నారు. చదువుకున్నవాళ్లు కూడా సంకుచిత మనస్తత్వంలో ఆలోచిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, ఇతర పార్టీల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేసినవారు కూడా బీజేపీలో చేరుతుండటం పట్ల ఉండవల్లి విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతం ఏంటో తెలియకుండా ఆ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.

చివరకు ఆంధ్రప్రదేశ్ లో ఒకరితో ఒకరు తిట్టుకుంటున్న టీడీపీ, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శించడం లేదని గుర్తు చేశారు. బీజేపీ సిద్ధాంతం వల్ల అందరికీ నష్టమే ఎక్కువ అని చెప్పారు. అన్ని రంగాల్లో మోడీ దెబ్బతిన్నారని చెప్పారు.

అలాగే జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి కేంద్రం, తెలంగాణల నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, ఆస్తుల విషయంలో పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయబద్ధంగా అడిగేందుకు కూడా జగన్ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.

 పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించడంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారని.. ఆయన కూడా మళ్లీ పోలవరాన్ని కేంద్రానికి అప్పగించడానికే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరాన్ని కేంద్రానికి అప్పగించకుండా.. మూడేళ్లు గడిచాక కేంద్రానికి అప్పగిస్తాననడం ఏమిటని నిలదీశారు.
Tags:    

Similar News