పవన్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-11-08 06:31 GMT
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ అధికారంలో లేడు కాబట్టి తాను ఆయనను విమర్శించబోనని తెలిపారు. పవన్‌పై ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రెక్కీ నిర్వహించారనే అంశంపై స్పందిస్తూ అది వివాదాస్పద అంశం అని చెప్పారు. దానిపై తానేమీ తీర్పు ఇవ్వలేనని.. నేడు న్యాయం అథపాతాళంలో ఉందని ఉండవల్లి హాట్‌ కామెంట్స్‌ చేశారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఎక్కువ ఉంటే కోర్టు తీర్పులు కూడా త్వరగా వస్తాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

కాగా గతంలో పవన్‌ కల్యాణ్‌ ఏపీ పునర్విభజన చట్టం, రాజధాని అంశం తదితరాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హాజరయిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ సినిమా హీరో అని.. అందరి లాగే తాను కూడా ఆయనను చూడటానికి వచ్చానని.. ఆయనను కలసి ఫొటో దిగానని ఉండవల్లి అప్పట్లో చమత్కరించారు.

ఇటీవల పలు యూట్యూబ్‌ చానెళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ జనసేన పార్టీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. తమ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ప్రభావం ఈసారి బాగా ఉంటుందని.. ఈసారితో పోలిస్తే ఆ పార్టీ బలపడిందని ఇప్పటికే పలుమార్లు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రతిపాదించినప్పుడు వ్యతిరేకించింది తానేనని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ గుర్తు చేశారు. అంతేకాకుండా భ్రమరావతి అనే పుస్తకం సైతం రాశానన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ సైతం అమరావతికి ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో రైతులు భూములివ్వడానికి ముందుకొచ్చారని తెలిపారు. జగన్‌ అమరావతికి ఒప్పుకోకుండా ఉంటే రైతులు భూములిచ్చేవారు కాదన్నారు. ఇక మూడు రాజధానులపై సుప్రీంకోర్టు ఏం తేలుస్తుందో చూడాల్సి ఉందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లు అయ్యే విషయం కాదన్నారు. ఈ విషయాన్ని ఇటీవల తేల్చిచెప్పిన జలవనరుల మంత్రిని నిజం చెప్పినందుకు అభినందించానని గుర్తు చేశారు. రాష్ట్ర పరిస్థితిపై 'విభజన వ్యథ' అనే పుస్తకం రాస్తున్నానని ఉండవల్లి అరుణ్‌ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News