విచార‌ణ చేస్తే...టీడీపీ నేత‌లంతా జైలుకేః ఉండ‌వ‌ల్లి

Update: 2017-12-03 15:23 GMT
పోల‌వరం ప్రాజెక్టు విష‌యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మ‌రోమారు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. విజయ‌వాడ ప్రెస్‌ క్ల‌బ్‌ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పై విచారణ జరిపితే టీడీపీ నేతలంతా జైలుకెళ్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం నెత్తినేసుకోవడంపై అనుమానాలున్నాయని ఉండ‌వ‌ల్లి పేర్కొన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు ఎందుకు తప్పులు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి పైసా ఖర్చు చేయాల్సింది కేంద్రమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. 2014లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో పెట్టింద‌ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు విష‌యంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన కృషి మ‌రువ‌లేనిద‌న్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 లోనే పోలవరం టెండర్లు పిలిచి త‌దుప‌రి ప్ర‌క్రియ‌ల‌ను కూడా పూర్తిచేశార‌ని తెలిపారు. ఒక్కో అనుమతిని ఆయనే సాధించారని గుర్తు చేశారు. ముంపు ప్రాంతాలకు ఇచ్చే పునరావాసం ఖర్చుకు ఆనాడే ముందు చూపుతో వైఎస్ఆర్ లెక్కగట్టి ప్రాజెక్ట్ ఖర్చులో చూపించారని ఉండ‌వ‌ల్లి తెలిపారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలను కూడా  ప‌రిష్క‌రించేందుకు వైఎస్ఆర్ ప్ర‌య‌త్నం చేశార‌ని వెల్ల‌డించారు.

పోలవరం హెడ్ వర్క్సు నిర్మాణానికి రూ.4200 కోట్లు అంచనాఅని, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు సుమారు రూ.3200 కోట్లు ఖర్చతుందని, ఈ మొత్తం పోలవరం కోసం ఖర్చుచేసి వుంటే ఇప్పటికే హెడ్‌వర్క్సు 70 శాతం పూర్తయ్యేదని ఉండ‌వ‌ల్లి అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాల‌నే కాంగ్రెస్ హయాంలోని ఆర్డినెన్స్‌ను ఎన్‌డిఎ ఎందుకు యథాతథంగా అమలుచేయలేదో, దాని వెనుక ఏమి జరిగిందో చంద్ర‌బాబు తేటతెల్లం చేయాలని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. పోలవరం కడితే 800 టీఎంసీలు వాడుకున్నా అడిగేవారు ఉండరని, ఆఖరి పాయింట్ కావడమే దీనికి కారణమని ఉండ‌వ‌ల్లి అన్నారు. మూడేళ్ల సమయాన్ని సీఎం చంద్రబాబు వృధా చేసి ఇప్పుడు నెపాన్ని కేంద్రాన్ని నెడుతున్నారు. 2014నాటి రేట్లకే కేంద్రం నిధులు ఇస్తుందని ఆనాడే నీతి అయోగ్ చెబితే బాబు ఎందుకు అంగీకరించారని నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖల్లో అమర్‌జిత్ సింగ్ ఏకంగా టెండర్లు నిలిపివేయమని సూచించారని, ఇ-ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన రాష్ట్ర వెబ్ సైట్ లో ఆలస్యంగా ఎందుకు వివరాలు పెట్టారని ఆ లేఖలో అభ్యంతరాలు తెలిపారని ఉండవల్లి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ నోటిఫికేషన్ లో 1300 కోట్లని, వెబ్‌సైట్లో సుమారు 1400 కోట్లు పెట్టారని, కేవలం కాంట్రాక్టుల కోసమే అని ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ఇప్పుడు కేంద్రం కూడా అడుగుతోందన్నారు. బహిరంగంగా పిలవాల్సిన టెండర్లను వెబ్ సైట్ లో ఎందుకు అప్ లోడ్ చేయలేదని ప్రశ్నించారు. బాబు వంటి మేధావికి ఎవ‌రు ఇలాంటి స‌ల‌హాలు ఇస్తున్నారో అర్థం కావడంలేద‌ని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధే లెక్కలు బయటపడితే జైలుకు వెళ్తారని హెచ్చరించినా చంద్రబాబు కళ్లు తెరవడం లేదని వ్యాఖ్యానించారు.

పోలవరం పనులు ముందుకు సాగడం లేదని టీడీపీ నేత నామా నాగేశ్వర రావు కంపెనీని పిలిచి, పనుల నుంచి తప్పించారని, అదే విష‌యాన్ని ప్ర‌స్తుతం అమ‌లు చేయాల‌న్నారు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ పనులు చేయడం లేదని తెలిస్తే సదరు కంపెనీతో మాట్లాడి తప్పించాలని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విష‌యంలో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వల్ల రాష్ట్రం దివాళా తీసిందని,లక్షల కోట్ల అప్పులు చేసిన‌ప్ప‌టికీ...ఆ విష‌యం మ‌రుగున పెట్టి చంద్రబాబు గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. 
Tags:    

Similar News