అమిత్ షా - తారక్ భేటీపై ఉండవల్లి విశ్లేషణ ఇది

Update: 2022-08-23 04:12 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త గుజ్జున్న నేతల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మరింత దారుణం. గడిచిన కొన్నేళ్లుగా బడా వ్యాపారస్తులు.. పారిశ్రామికవేత్తల్ని రాజకీయ నేతలుగా చేసేసి.. వారి చేత ప్రజాసేవ చేయిస్తున్న నేపథ్యంలో.. ఏపీ రాజకీయం ఎలా తగలబడిందన్న విషయం తెలిసిందే. అలాంటి చోట సీనియర్ రాజకీయ నేత.. ఏ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకోకుండా.. తనకు అనిపించిన విషయాన్ని అనిపించినట్లుగా చెప్పే ఉండవల్లి.. తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఆదివారం బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో భాగంగా తిరిగి వెళ్లే వేళలో.. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను తనవద్దకు పిలిపించుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పలు విశ్లేషణలు బయటకు వచ్చాయి. అయితే.. వీటికి భిన్నంగా ఉండవల్లి చేసిన విశ్లేషణపై ఆసక్తి వ్యక్తమవుతోంది. రాజకీయ నేతలతో నేరుగా సంబంధాలు ఉండటంతో పాటు.. విషయాన్ని లోతుగా చూసే వైఖరి ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతుంది.

అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ సమావేశం ఎలాంటి పరిస్థితులకు కారణమవుతుందన్న విషయాన్ని ఆయన చెబుతూ.. కచ్ఛితంగా రాజకీయం ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్ ను వినియోగించుకునే ఛాన్సు ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు అన్ని విషయాల మీద అవగాహన ఉందన్నారు.

ఎప్పుడెలా వ్యవహరించాలో తారక్ కు తెలుసన్న ఉండవల్లి.. ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. 'చంద్రబాబుకు తారక్ కు పడదని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ కావటం ఆసక్తికరం. అతడికి కచ్ఛితంగా పొలిటికల్ ఇంట్రస్టు ఉంది. టీడీపీ కోసం 2009 ఎన్నికల్లో చాలా కష్టపడి తిరిగాడు.

రెండు రాష్ట్రాల్లో జనంలో కలిసి పోయాడు. అప్పట్లో తారక్ స్పీచ్ విన్నా. మంచి ఎక్స్ ప్రెషన్ ఉంది. ఫేస్ కట్ సీనియర్ ఎన్టీఆర్ లా ఉంటుంది. ఈ తరం వారు ఎన్టీఆర్ ను మర్చిపోయి ఉండొచ్చు. మా తరం వాళ్లందరికీ సీనియర్ ఎన్టీఆర్ ఫేస్ జూనియర్ ఎన్టీఆర్ లో కనిపిస్తుంది' అని వ్యాఖ్యానించారు.

జూనియర్ ఎన్టీఆర్ మీద తన అభిప్రాయాన్ని వెల్లడించటంతోపాటు.. అతడి రాజకీయ అభిలాష గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి.. తారక్ తండ్రి హరిక్రిష్ణ గురించి కూడా చెప్పుకొచ్చారు. తారక్ తండ్రి హరిక్రిష్ణ మీద తనకు మంచి అభిప్రాయం ఉందన్నారు. 'చాలా మర్యాద మనిషి. మేనర్స్ తెలిసిన వ్యక్తి. బాగా మాట్లాడతారు' అని హరిక్రిష్ణ గురించి చెప్పుకొచ్చారు.
అమిత్ షా - ఎన్టీఆర్ మధ్య భేటీ గురించి విశ్లేషిస్తూ.. వారిద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ.. వారి భేటీ మాత్రం కచ్ఛితంగా రాజకీయంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా తనను కలిసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించారంటే కచ్ఛితంగా అది రాజకీయమే అవుతుందని పేర్కొన్నారు.
Tags:    

Similar News