‘జూనియర్’ మాటల్ని కొట్టి పారేసిన ‘సీనియర్’

Update: 2016-08-13 04:35 GMT
వారిద్దరూ ఆర్ బీఐ గవర్నర్లుగా చేసిన వారే. వారిలో ఒకరు ఆర్ బీఐ గవర్నర్ గా చేసి.. తనదైన ముద్రను వేసిన దువ్వూరి సుబ్బారావు కాగా.. మరొకరు కొద్ది రోజుల్లో ఆర్ బీఐ గవర్నర్ గా పదవీబాధ్యతల నుంచి వైదొలుగుతున్న రఘురామ్ రాజన్. ఇలాంటి ఇద్దరు ఒకే వేదిక మీదకు రావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా రాజన్ చేసిన వ్యాఖ్యను దువ్వూరి విభేదించటం ఆసక్తికరంగా మారింది.

ఒక పుస్తకావిష్కరణ కోసం ముంబయిలోని ఒక వేదిక మీదకు ఈ ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా ఆర్ బీఐ గవర్నర్ కు నైతిక నియమావళి ఉండాలంటూ రాజన్ ప్రతిపాదించారు. దీనికి సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేయటమే కాదు.. గవర్నర్ ఏ అంశాలపై మాట్లాడాలన్న అంశంపై నైతిక నియమావళి ఉండాలని తాను కోరుకోవటం లేదన్నారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఫలానా అంశాల మీదనే మాట్లాడాలి.. మిగిలిన అంశాల జోలికి వెళ్లకూడదంటూ చెప్పటం ఏ మాత్రం సరికాదని దువ్వూరి తేల్చి చెప్పటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆర్ బీఐ గవర్నర్ గా వ్యవహరిస్తున్న రాజన్.. తన వాదనకు భిన్నంగా ఇప్పటికే పలు అంశాల మీద వ్యాఖ్యలు చేయటం.. అవి వార్తాంశాలుగా మారటం తెలిసిందే. అలాంటి ఆయన.. ఏ అంశాల మీద మాట్లాడాలన్న దానిపై నియమావళి ఉండాలని ప్రతిపాదిస్తే.. రాజన్ కు సీనియర్ అయిన మాజీ ఆర్ బీఐ గవర్నర్ దువ్వూరి మాత్రం అసలుఅలాంటి అవసరమే లేదని తేల్చేయటం గమనార్హం. ఏమైనా ఈ సీనియర్.. జూనియర్లు బహిరంగంగా ఒక అంశంపై విభేధించుకునేలా మాట్లాడుకోవటం అందరి దృష్టిని ఆకర్షించింది.
Tags:    

Similar News