పాకిస్తాన్ లో పూట గడవని పరిస్థితులు, కారణమా..!

Update: 2022-08-02 07:42 GMT
రోజు ఎలా గడుస్తుంది? అని  పాకిస్తాన్ లో మధ్య తరగతి , పేద వాళ్లని అడిగితే.. రోజు గడవడమేంటి? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామనే సమాధానం వస్తుంది. ఎందుకంటే అక్కడి ద్రవ్యోల్భణం పేద, మధ్య తరగతి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కనీసం మూడు పూటల తిండి కూడా తినలేని దుస్థితిని ప్రస్తుత సర్కార్ కలిగిస్తోందని పాకిస్తాన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

''పాల ధర విపరీతంగా పెరిగిపోయింది. అందుకే టీ తాగడం కూడా మానేశాను. ఉదయం నేను సులేమానీ (గ్రీన్ టీ) చేస్తాను. అది కూడా పిల్లల కోసమే. భోజనం ఖర్చుతో పాటు విద్యుత్ బిల్లు కూడా పెను భారంగా మారుతోందని ఆమె తెలిపారు. గత నెలలో తనకు రూ.2,500 బిల్లు వచ్చింది. నాకొచ్చే రూ.12,000లో రూ.2500 కరెంటు బిల్లు కు తీసేయాలి. ఆ తర్వాత మిగిలిన దాంట్లోనే ఆరుగురు పిల్లలకు నెల మొత్తం వండిపెట్టాలి'' అని రజియా అనే మహిళ వాపోయారు. ఇది రజియా ఒక్కరి బాధే కాదు పాకిస్థాన్‌లోని పేద, మధ్య తరగతి వాళ్లందరిది. పెరుగుతున్న ధరలు వాళ్లని కనీసం మూడు పూటలా తిండి కూడా తిన నీయకుండా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది?జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి చెందిన గణాంకాలను పాకిస్థాన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దీనిలో ద్రవ్యోల్బణ రేటు ను 21 శాతంగా పేర్కొన్నారు. అయితే, ఇది మరింత పెరిగే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 'డాలరుతో పాకిస్థానీ రూపాయి మారకం విలువ పడిపోవడం తో పాటు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోంది. ఆహార పదార్థాలతోపాటు నిత్యవసరాలకు చాలావరకు దిగుమతులపై పాకిస్తాన్ ఆధారపడుతుంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ రూపాయి మారకపు విలువ మరింత పడిపోయే ముప్పుంది. దీంతో ధరలు కూడా పెరిగే అవకాశముంది' అని నిపుణులు భావిస్తున్నారు.

ధరల పెరుగుదలకు కారణం ఎవరు?ద్రవ్యోల్బణానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని ఆ దేశ ఆర్థిక మంత్రి డాక్టర్ హఫీజ్ పాషా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ''ఇదివరకటి పీటీఐ ప్రభుత్వం చేసిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మరోవైపు అంతర్జాతీ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు''అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఆర్థిక నిపుణుడు ఆమిర్ ఖాన్.. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పారు. ''అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అవి పాకిస్థాన్ మీద కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి''అని ఆయన అన్నారు.

ద్రవ్యోల్బణం వల్ల పాకిస్థాన్‌లో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో పీటీఐ ప్రభుత్వం కుప్పకూలేనాటికి ద్రవ్యోల్బణ రేటు 10.7 శాతంగా ఉండేది. ఆ తర్వాత విపరీతంగా ధరలు పెరుగుతూ వెళ్లాయి. ప్రస్తుతం ఇది 20 శాతానికి మించిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వంట నూనె 48 శాతం, కూరగాయలు 35 శాతం, పప్పులు 38 శాతం, కోడి మాంసం 20 శాతం, మేక మాంసం 23 శాతం చొప్పున ధరలు పెరిగాయి.

ముస్లిం లీగ్ (నవాజ్) ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి నెలలో ద్రవ్యోల్బణం రేటు 13.37 శాతంగా ఉండేది. మే నెలలో ఇది 13.76 శాతానికి చేరుకుంది. కానీ, జూన్‌లో మాత్రం 21.32 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఉల్లిపాయలు 124 శాతం, వంట నూనె 70 శాతం, చికెన్ 47 శాతం, గోధుమలు 31 శాతం, పాలు 21 శాతం ధరలు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తంగా ద్రవ్యోల్బణం 21 శాతం మించి పోవచ్చని డాక్టర్ హఫీస్ పాషా వివరించారు. ఇలాంటి రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం 2008, 1974 లలో మాత్రమే నమోదయింది.
Tags:    

Similar News