ఏపీలో ఆ యోగం భాగ్యం ఎవ‌రికి మోడీ?

Update: 2018-05-01 12:42 GMT
కొన్నిసార్లు అంతే. అదృష్టం త‌లుపు త‌డుతుంది. రాజ‌కీయాల్లో ఇలాంటివి అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి. ప‌ద‌వి కోసం ఎంత తాపత్ర‌య ప‌డినా కొంద‌రికి అవ‌కాశం అస్స‌లు రాదు. మ‌రికొంద‌రికేమో.. ముసుగు త‌న్ని ప‌డుకున్నా.. ప‌ద‌వులు వెతుక్కుంటూ వ‌స్తుంటాయి. కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల పుణ్య‌మా అని ఏపీ బీజేపీ నేత‌ల‌కు అదృష్టంగా మార‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది కంటే త‌క్కువ స‌మ‌య‌మే ఉన్న‌ప్ప‌టికీ.. కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ప‌లుక‌రిస్తుంద‌న్న ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఎక్కే అవ‌కాశం త‌మ‌కే ద‌క్కుతుంద‌న్న ఆశ‌లో ఏపీ క‌మ‌ల‌నాథులు కొంద‌రున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా  ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌కుండా ఉండిపోయిన మోడీ తీరును త‌ప్పు ప‌డుతూ ఏపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌మ ఎంపీల చేత రాజీనామా చేయించిన వైనం తెలిసిందే. ఇది కాస్తా బాబుపై ఒత్తిడిని పెంచ‌టంతో ఆయ‌న మోడీ స‌ర్కారు నుంచి బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. తెగ తెంపులు చేసుకొని హోదా ఉద్య‌మాన్ని మొద‌లు పెట్టారు.

నాలుగేళ్లుగా క‌నిపించ‌ని మోడీ వైఫ‌ల్యాల‌న్నీ ఇప్పుడు బాబుకు క‌నిపిస్తున్నాయి. మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి వేళ‌.. ఏపీలో త‌రుగుతున్న త‌మ గ్రాఫ్ ను పెంచుకోవ‌టంపై బీజేపీ అధినాయ‌క‌త్వం దృష్టి పెట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఏపీకి చెందిన ఇద్ద‌రు కేంద్ర‌మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆ ప‌ద‌వుల్ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు క‌ట్ట‌బెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో మోడీషాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఆ మ‌ధ్య‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో విశాఖ ఎంపీ హ‌రిబాబుకు మోడీ కేబినెట్‌ లో స్థానం ల‌భించింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి హ‌రిబాబు అనుచ‌రులైతే త‌మ నాయ‌కుడు కేంద్ర‌మంత్రి అయిన‌ట్లుగా ఫీల‌య్యారు. మిఠాయిలు పంచేసుకున్నారు కూడా. చివ‌రి నిమిషంలో నిర్ణ‌యం మార‌టంతో హ‌రిబాబుకు ద‌క్కింద‌నుకున్న అవ‌కాశం  మిస్ అయిన‌ ప‌రిస్థితి. ఇటీవ‌ల ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని ఇస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

సౌమ్యుడు.. ఎలాంటి మ‌చ్చ లేని హ‌రిబాబుకు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌టం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు సానుకూల సందేశాన్ని పంపిన‌ట్లుగా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో క‌మ‌లనాథులు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేస్తున్న వేళ‌లో కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల్ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు  కేటాయిస్తే.. క్యాడ‌ర్ లో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

హ‌రిబాబుకు అవ‌కాశం ద‌క్క‌ని ప‌రిస్థితుల్లో మ‌రెవ‌రికి అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని చూస్తే.. గోక‌రాజు గంగ‌రాజుకు ఛాన్స్ ఉండొచ్చ‌న్న అభిప్రాయం ఉంది. ఒక‌వేళ‌.. ఈయ‌న‌కుఅవ‌కాశం ద‌క్క‌ని ప‌రిస్థితుల్లో తెలుగువాడైన‌ప్ప‌టికీ.. వేరే రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన జీవీఎల్ న‌ర‌సింహ‌రావుకు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ద‌క్కే వీలుందంటున్నారు.

అయితే.. ఆయ‌న‌కు ఏపీ ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాలు లేని కార‌ణంగా.. ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చినా క‌లిగే ప్ర‌యోజ‌నం త‌క్కువేన‌న్న మాట వినిపిస్తోంది. ఒక‌వేళ ఇదే అభిప్రాయానికి మోడీషాలు వ‌స్తే.. జీవీఎల్‌కు కేబినెట్‌లో ఛాన్స్ ల‌భించ‌న‌ట్లే. ఏమైనా.. మ‌రికొద్దిరోజుల్లో మోడీ మంత్రివ‌ర్గంలో ఛాన్స్ కొట్టే ఏపీ క‌మ‌ల‌నాథులు ఎవ‌ర‌న్నది తేలుతుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News