అమిత్ షా మాటల్లో అండర్ లైన్ చేసుకోవాల్సిన వ్యాఖ్యలు ఇవే

Update: 2022-05-15 06:38 GMT
టీఆర్ఎస్ - బీజేపీ మధ్యన ఏముంది? సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉంది. లేకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడినా.. ఆ మాటను ప్రస్తావించటానికి జంకే పరిస్థితి ఎందుకు? అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటారు. చీకటి ఒప్పందంలో భాగంగానే టీఆర్ఎస్ కు రహస్య మిత్రుడిగా కమలనాథులు వ్యవహరిస్తున్నారన్నఆరోపణల గురించి తెలిసిందే. తమను లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్ ఇవ్వటంతో పాటు.. గులాబీ బాస్ కు.. ఆయన కుటుంబానికి భారీ షాకిచ్చేలా వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

గడిచిన కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలు పలువురు కేసీఆర్ కుటుంబ పాలనను.. కేసీఆర్ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. బీజేపీ అధినాయకత్వం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించేది. ఘాటు విమర్శలు చేయటానికి పెద్ద ఆసక్తిని ప్రదర్శించేది కాదు. ఇలాంటివేళ.. అలాంటి మొహమాటాల్ని పక్కన పెట్టేసి.. కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు అమిత్ షా. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే.. గులాబీ పార్టీ మీద కమలనాథులు నేరుగా ఫైటింగ్ కు పిలుపు ఇచ్చినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత పాదయాత్రను ముగించిన సందర్భంగా హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన తుక్కుగూడ బహిరంగ సభలో అమిత్ షా చెలరేగిపోయారు. కేసీఆర్ ను మాత్రమే కాదు.. ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్..కుమార్తె ఎమ్మెల్సీ కవితపైనా ఘాటు విమర్శలు.. ఆరోపణల్ని సంధించటం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి.. అండర్ లైన్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేమిటో చూస్తే..

-''తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులు పాలు చేశారు. తిరిగి ఇప్పుడు మరిన్ని అప్పులు కావాలని కోరుతున్నారు. ఎందుకోసం ఈ అప్పులు? కొడుకు.. కూతురి కోసమా? ఇన్ని కుంభకోణాలకుపాల్పడినా.. ఇంకా మీ కడుపు నిండలేదా?’’

-  నేను 13 ఏళ్ల వయసు నుంచే రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు నా వయసు 57 ఏళ్లు. కానీ.. ఇప్పటివరకు ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలడానికి తెలంగాణ యువత ముందుకు రావాలి.

-'మీరెప్పుడూ సచివాలయానికి వెళ్లరు. అందులో అడుగు పెడితే అధికారం పోతుంద’ని ఎవరో మాంత్రికుడు చెప్పారట. కానీ, నేను చెబుతున్నా.. మీ ప్రభుత్వం గద్దె దిగడానికి మాంత్రికుడు అక్కర్లేదు. తెలంగాణ ప్రజలే మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకళిస్తారు.

-  కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావడానికి ముందు ధాన్యానికి మద్దతు ధర రూ.1340 ఉండేది. దీనిని రూ.1940 చేశాం. 11 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తున్నాం. ధాన్యం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతారా?

-  తెలంగాణ కోసం మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. మీరు మాత్రం మోదీ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడం తప్ప మరేమీ చేయలేదు. మోదీ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకాన్ని తెస్తే.. ఆ పథకాన్ని, కేంద్రం నిధులను తీసుకొని 'మన ఊరు-మన బడి’ పేరుతో అమలు చేస్తున్నారు. మీ ఫొటో, మీ కొడుకు ఫొటో పెట్టి, పథకం పేరు మార్చి అమలు చేస్తున్నారు.

-  స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తామన్నారు. చివరకు కొడుక్కి..కూతురికి అధికారాలు ఇచ్చారు.

-   కశ్మీర్‌ నుంచి ఆర్టికల్‌ 370ని ఎత్తివేశాం. మజ్లిస్‌ భయంతో ఈ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్‌ వ్యతిరేకించింది.

-  మేం మజ్లిస్ కు.. మీకు భయపడం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పారు. మజ్లిస్ కు భయపడి నిర్వహించటం లేదు. టీఆర్ఎస్ గుర్తు కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉంది.

-  బీజేపీ అధికారంలోకి వచ్చినంతనే తెలంగాణ విముక్తి ఉద్యమాన్ని జరుపుతాం. నిజాం.. రజాకారుల అకృత్యాల నుంచి తెలంగాణ.. కర్ణాటక.. మహారాష్ట్ర విముర్తి పొందిన రోజును విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తాం.

-  రూ.18 వేల కోట్లను ఉపాధి హామీ పథకానికి ఇస్తే.. ఆ నిధులతో హరితహారం కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఆ పథకానికి మీ పేరు, మీ కొడుకు ఫొటోలు అతికించారు. హరితహారం కార్యక్రమం కేంద్రానిదే.

-  ప్రధానమంత్రి సింఛాయ్‌ యోజన కింద ఆర్డీఎస్‌, నెట్టెంపాడు పథకాలకు కేంద్రం నిధులిస్తుంటే.. ఆ పథకాలను అమలు చేయడం లేదు. వీటి వల్ల కమీషన్‌ రావడం లేదనే పక్కన పెట్టేశారు.

-  హైదరాబాద్‌లో సైన్స్‌ సిటీకి భూములు ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వడంలేదు. 2017 నుంచి వరంగల్‌లో సైనిక్‌ స్కూలు పెట్టడానికి భూములు ఇవ్వాలన్నా ఇవ్వడం లేదు.

-  శ హోం మంత్రిగా, బీజేపీ కార్యకర్తగా అమిత్‌షా బరాబర్‌ హైదరాబాద్‌ వస్తారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేస్తున్న మేలును చెబుతారు. కేసీఆర్‌ పాలనను ఎండగడతారు. బీజేపీ జెండా ఎగరేస్తా

-  రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగకుండా, దానిని మార్చాలనే ఆలోచనను కేసీఆర్‌ పదేపదే చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
Tags:    

Similar News