కేంద్ర మంత్రికి షాకిచ్చిన ఐఏఎస్.. గాలికి బ్రిడ్జి కూలిందట

Update: 2022-05-10 06:45 GMT
తెగించినోడికి.. బరితెగించినోడికి పెద్ద తేడా ఉండదు. ఏం జరిగినా సరే.. అదేం పెద్ద విషయం కాదన్నట్లుగా వ్యవహరించే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతాన్ని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. నిర్మాణ లోపంతో కూలిన బ్రిడ్జి గురించి ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాటల్ని చెబుతూ.. 'గాలికి కడుతున్న బ్రిడ్జి కూలింది' అని కేంద్రమంత్రిగా ఉన్న తనతో చెప్పిన మాటల్ని చెప్పుకొచ్చారు.

బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తాజాగా నిర్వహించిన ఒక రివ్యూలో గడ్కరీ వెల్లడించారు. బీహారర్ లోని సుల్తాన్ గంజ్ లో గంగా నదిపై ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనిలోని కొంత భాగం ఏప్రిల్ 29న కూలింది. దీనిపై సంబంధిత ఐఏఎస్ అధికారిని తాను వివరణ అడిగినట్లు చెప్పారు. ఆ సందర్భంగా ఆ అధికారి చెప్పిన మాటలు తనకు విస్మయానికి గురి చేశాయన్నారు.

బ్రిడ్జి ఎందుకు కూలిందన్న దానికి వివరణ ఇచ్చిన సదరు ఐఏఎస్ అధికారి.. గాలి వీయటంతో బ్రిడ్జి కూలిందని తనకు చెప్పారన్నారు. 'ఆ అధికారి మాటలు నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఎంత గట్టిగా గాలి వీచినా.. బ్రిడ్జి ఎందుకు కూలుతుందో అర్థం కాలేదు.

రూ.1710 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిందంటే అందులో నిర్మాణ లోపం ఉన్నట్లే. 3.12 కిలో మీటర్ల నిడివి ఉన్న ఈ బ్రిడ్జి పూర్తి అయితే.. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జిగా నిలవనుంది' అని ఆయన చెప్పుకొచ్చారు.

నోటికి వచ్చినట్లుగా గాలి మాటలు చెప్పిన సదరు ఐఏఎస్ అధికారి విషయంలో గడ్కరీ ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెబితే.. మిగిలిన వారికి కాస్తంత గుణపాఠంగా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇదంతా చూస్తే.. మిగిలిన ప్రభుత్వాల మాదిరే కేంద్రంలోని మోడీ సర్కారు హయాంలోనూ అధికారుల ఇష్టారాజ్యం నడుస్తుందన్న విషయం అర్థమవుతుంది. అయితే.. ఇలాంటి బాధ్యతలేని అధికారుల విషయంలో తమ సర్కారు ఎంత కఠినంగా ఉందో గడ్కరీ సాబ్ చెప్పి ఉండాల్సింది.
Tags:    

Similar News