కేంద్రమంత్రి నోట.. కేసీఆర్ చేతగానితనం మాట

Update: 2021-12-22 02:22 GMT
తెలంగాణ లో ప్రతి రైతు పండించే వరి పంటను మేం కొంటాం. ఆఖరి ధాన్యం వరకు మేమే కొనుగోలు చేస్తామంటూ భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం.. ప్రెస్ మీట్లు పెట్టి బడాయి మాటలు కేసీఆర్ నోటి నుంచి రావటం రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అలాంటిది.. కేంద్రం బియ్యం కొనుగోలు చేయటం లేదని.. అందుకే తాము వరిపంటను కొనమని చెప్పటం ద్వారా దిమ్మ తిరిగే షాకిచ్చారు కేసీఆర్. ఎందుకిలా అంటే.. ఇప్పటివరకు తాము పండించిన పంట మొత్తాన్ని కొని.. డబ్బులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమని భావించిన వారికి.. కేసీఆర్ తాజా మాటల పుణ్యమా అని.. కొనేది కేంద్రమైతే.. మధ్యలో మధ్యవర్తిగా వ్యవహరించేది కేసీఆర్ అన్న విషయం స్పష్టం కావటం తో నోట మాట రాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. కేంద్రం రైతులు పండించిన వరిని కొనమని చెబుతున్నారని.. అందుకే వరి పంట వేయొద్దన్న మాట కేసీఆర్ అదే పనిగా చెప్పటం.. తమ మాట వినకుండా వరిని పండిస్తే.. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని కట్ చేస్తామన్న మాట వరకు వెళ్లింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ చెప్పే మాటలకు భిన్నమైన మాటల్ని.. లెక్కల్ని చెబుతున్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. తమకు మాట ఇచ్చిన ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం బియ్యాన్ని ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం గత రబీకి సంబంధించి ఎఫ్ సీఐకు ఇవ్వాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వలేదన్నారు.

అంతే కాదు.. పీయూష్ నోటి నుంచి కీలకమైన వ్యాఖ్య వచ్చింది. ‘సీఎం కేసీఆర్ తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకోనేందుకు తప్పుడు మాటలు మాట్లాడుతూ రాష్ట్ర రైతుల్ని.. ప్రజల్ని భ్రమలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్ సీఐకు ఇవ్వాల్సిన 27 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తప్పనిసరిగా తెలంగాణకు చెందిన రబీ పంటే అయి ఉండాలని.. బయటి రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అందిస్తామంటే కుదరదన్నారు. ఒప్పందంలో భాగంగా నిర్ణయించిన నాణ్యత విషయంలోనూ తాము రాజీ పడమని స్పష్టం చేశారు. ఓపక్క కేసీఆర్ ఏమో.. కేంద్రం బియ్యం కొనటం లేదని చెబుతుంటే.. మరోవైపు పీయూష్ మాత్రం తమకు మాట ఇచ్చి కూడా బియ్యాన్ని ఇవ్వలేదన్న లెక్క పై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.
Tags:    

Similar News