కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తెకు షాక్!

Update: 2022-07-23 06:40 GMT
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీకి గోవా ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చింది. గోవాలోని అస్సాగోవ్ లో సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ అనే పేరుతో స్మృతి ఇరానీ కుటుంబం ఒక రెస్టారెంట్ ను నడుపుతోంది. అయితే మ‌ర‌ణించిన వ్య‌క్తి పేరుతో మోస‌పూరిత మార్గాల్లో మద్యం లైసెన్స్ ను పొంద‌డంతోపాటు, దాన్ని పున‌రుద్ధ‌రించాని జోయిష్ ఇరానీపై అభియోగాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో గోవా ఎక్సైజ్ శాఖ క‌మిష‌నర్ నారాయ‌ణ్ ఎంగాడ్ రెస్టారెంటుకు జూలై 21న‌ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఈ చట్టవ్యతిరేక చర్య గురించి పక్కా సమాచారం అందుకున్న‌ లాయర్ రోడ్రిగ్స్ స‌మాచార హ‌క్కు కింద‌ రెస్టారెంట్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఉపయోగించిన మోసపూరిత పత్రాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి కుటుంబానికి ఎక్సైజ్ అధికారులు, స్థానిక అస్సాగావో పంచాయితీ అధికారులు స‌మాయం చేశార‌ని లాయ‌ర్ రోడ్రిగ్స్ చెబుతున్నారు. మోసం చేసి మ‌ద్యం లైసెన్సు పొంద‌డంపై వీరంద‌రిపై విచార‌ణ చేయాల‌ని లాయ‌ర్ రోడ్రిగ్స్ కోరుతున్నారు.

స్మృతి ఇరానీ కుటుంబానికి చెందిన‌ సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ కు గోవాలో కార్యకలాపాలు నిర్వహించడానికి ఇప్పటికీ రెస్టారెంట్ లైసెన్స్ లేదని ఆయ‌న అంటున్నారు. విదేశీ మద్యం, భారత తయారీ విదేశీ మద్యానికి లైసెన్స్ ఇవ్వడానికే ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించింద‌ని లాయ‌ర్ ఆరోపిస్తున్నారు.

కాగా జూలై 29న ఈ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది. కాగా షోకాజ్ నోటీసు ప్రకారం.. మ‌ద్యం లైసెన్స్ పొందిన వ్య‌క్తి ఆంథోనీద్గామా గత ఏడాది మే 17 మరణించినప్పటికీ, రెస్టారెంట్ మద్యం లైసెన్స్ ను అత‌డి పేరుతోనే గత నెలలో పునరుద్ధరింప‌జేసి పొందారు.

ఈ ఏడాది జూన్ 22న‌ ఆంథోనీ‌ద్గామా పేరుతో రెస్టారెంట్ లైసెన్స్ రెన్యువ‌ల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే వాస్త‌వానికి లైసెన్సు పొందిన‌ ఆంథోని గ‌తేడాది మేలో మ‌ర‌ణించ‌డంతో స్మృతి కుమార్తెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
Tags:    

Similar News