యూపీలో ఘోరం : నామినేషన్ వేయడానికి వెళ్తే పేపర్స్ లాక్కొని , చీరను లాగేసి ... !

Update: 2021-07-09 08:31 GMT
యూపీలో మహిళలపై జరిగే అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన మహిళపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ఆమె చీర లాగారు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..యూపీలో ఈ మధ్యనే స్థానిక సంస్థల  ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే, లక్ష్మీపూర్ ఖేరి అనే ప్రాంతంలో ఓ మహిళ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె సమాజ్‌వాది పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయానికి బయలుదేరింది. అయితే, సదరు మహిళ పోటీ చేయడాన్ని ప్రత్యర్థులు  అడ్డుకున్నారు. ఆమె చేతి నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ చీరను సైతం లాగేశారు.

అయితే, ఈ వివాదాన్ని కొందరు తమ ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అవుతోంది. తమ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఎకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఇక దాడికి పాల్పడింది బీజేపీ వాళ్లేనని సమాజ్‌వాదీ పార్టీ అంటోంది. లక్నోకు 130కిలోమీటర్ల దూరంలోని లఖింపూర్‌ ఖేరీలో  ఈ ఘటన చోటు చేసుకుంది.ఇక మహిళపై దాడి వీడియోను చూసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్.. తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూపీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇది చేసింది కచ్చితంగా బీజేపీ నేతలే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ పైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు ఉన్న రక్షణ  ఇదేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. యూపీలో 825 పంచాయితీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా  చాలాచోట్ల నామినేషన్ల పర్వంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరోవైపు అందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు.
Tags:    

Similar News