ఎస్పీ నుంచి ఆరేళ్ల పాటు అఖిలేష్ స‌స్పెండ్‌!

Update: 2016-12-30 13:55 GMT
ఉత్తరప్రదేశ్ లో అధికార స‌మాజ్‌ వాదీ పార్టీలో ముస‌లం తారాస్థాయికి చేరింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న క్ర‌మంలో భాగంగా పార్టీ నుంచి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌ ను బహిష్కరిస్తున్నట్లు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రకటించారు. అఖిలేష్‌ తో పాటు రాంగోపాల్ యాదవ్‌ ను ఆరేళ్ల పాటు బహిష్కరించారు. అఖిలేష్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీని కాపాడటం తన బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.

403 స్థానాల యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండానే ములాయం బుధవారం 325 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రోజంతా ఉత్కంఠపూరిత పరిణామాలు కొనసాగాయి. తొలుత మద్దతుదారులతో భేటీ అయిన అఖిలేశ్, ఆ తర్వాత ములాయం నిర్వహించిన సమావేశానికి హాజరై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత 235 మంది అభ్యర్థుల తో సొంతంగా సమాంతర జాబితా విడుదల చేశారు. ఆ మ‌రుస‌టి రోజునే అఖిలేష్ పై వేటు వేశారు.

అఖిలేశ్ బుందేల్‌ ఖండ్ పర్యటనలో ఉండగా, ఆయనకు ఏమాత్రం తెలియకుండా యూపీ పార్టీ అధ్యక్షుడైన శివ్‌పాల్‌ యాదవ్‌ తో కలిసి ములాయం జాబితాను ప్రకటించడంపై సీఎం మద్దతుదారులు తీవ్రంగా ప్రతిస్పందించారు. గురువారం అంతా అఖిలేశ్-ములాయం-శివ్‌ పాల్ నివాసాల వద్ద సందడి చోటుచేసుకుంది. ఒకవైపు అంతర్గత సంప్రదింపులు జరుగుతుండగానే పార్టీ అధినేత ములాయం నిర్వహించిన సమావేశానికి సీఎం అఖిలేశ్‌ తోపాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శివ్‌ పాల్‌ యాదవ్ కూడా హాజరయ్యారు. వివాదాలు వీడి సమిష్టిగా ముందుకు సాగితే ఎన్నికల సమరంలో గెలుస్తామని చెప్పినట్టు సమాచారం. తాను లేకుండా, తాను ఇచ్చిన అభ్యర్థులను జాబితాను పట్టించుకోకుండా 325 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంపై అఖిలేశ్ అసంతప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు తన అనుచరులైన రాం గోవింద్ చౌదరి - పవన్‌ పాండే - అరవింద్‌ సింగ్ గోపి వంటి మంత్రులకు జాబితాలో చోటుదక్కకపోవడంపై, ప్రముఖ గ్యాంగ్‌ స్టర్ ముక్తార్ అన్సారీ సోదరుడు సిగ్భదుల్లా అన్సారీ, క్రిమినల్ కేసులు ఉన్న అతిక్ అహ్మద్‌ కు టికెట్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. అనంతరం రాత్రి మరోసారి తన మద్దతుదారులతో సమావేశమైన అఖిలేశ్ సమాంతర జాబితాను ప్రకటించారు. అంతకుముందు ఎస్పీ ప్రధాన కార్యదర్శి, ములాయంకు వరుసకు మరో సోదరుడైన రాంగోపాల్‌ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్‌ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయొద్దని పార్టీలోని చాలామంది కోరుకుంటున్నారు. కానీ, ఆయననే ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు అనుకుంటున్నారన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News