ఆ వ్యూహ‌క‌ర్త‌ను పొగుడుతూనే..విమ‌ర్శిస్తున్నారు

Update: 2017-03-12 06:15 GMT
ప్రశాంత్ కిశోర్.... ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గెలుపు వెనుక ఉన్న కీల‌క శ‌క్తుల్లో ఈయ‌న ఒక‌రు. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆయ‌న బీజేపీకి దూరమ‌య్యారు. అనంత‌రం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ శతవిధాల ప్రయత్నించినా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ గెలుపొందడానికి దోహదం చేశారు. అలాంటి స‌త్తా గల ప్రశాంత్ కిశోర్‌ ఉత్తరప్రదేశ్‌ లో ఈసారి కాంగ్రెస్ విజ‌యానికి వ్యూహరచన చేశారు. అయితే, అది ఏమాత్రం పనిచేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఎన్నడూ లేని రీతిలో ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీలో రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. దీంతో ఆయ‌న‌పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. గొప్ప వ్యూహక‌ర్త‌గా చెప్పుకొంటున్న వ్య‌క్తి ప్ర‌ణాళిక‌లు ఏమ‌వుతున్నాయ‌ని ప్ర‌శ్నించారు. అయితే, ఈ ఘోర పరాజయానికి రాహుల్‌ పూర్తిబాధ్యత తీసుకోవాలని మాజీ ఎంపీ సందీప్‌ దీక్షిత్‌ స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ మాజీముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమారుడైన సందీప్‌ రాహుల్‌పై తొలిసారిగా అస్త్రాన్ని సంధించ‌డం సంచ‌ల‌నంగా మారింది.
 
మ‌రోవైపు పంజాబ్‌ లో కాంగ్రెస్ విజ‌యం క్రెడిట్ ప్ర‌శాంత్ కిశోర్ ఖాతాలో ప‌డింది. ప్రశాంత్ కిశోర్ వ్యూహాల వ‌ల్లే పదేళ్ల‌ తర్వాత పంజాబ్‌ లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబెట్టార‌ని ఆ రాష్ట్ర పార్టీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను చాటి చెప్ప‌డంతో పాటు కాంగ్రెస్ బ‌లోపేతానికి ఆయ‌న వ్యూహాలు స‌రైన ఫ‌లితాన్ని ఇచ్చాయ‌ని ఇలా త‌మ పార్టీ విజ‌యంలో ముఖ్యభూమిక పోషించారని  చెప్తున్నారు. కాగా, ప్ర‌శాంత్ సన్నిహితులు యూపీ ప‌రాజయాన్ని త‌మ ఖాతాలో వేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నాయి. ఎన్నిక‌ల‌కు చాలా కాలం ముందే కాంగ్రెస్ కోసం తాము ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్లు చెప్తున్నారు. ప్ర‌శాంత్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని పెక్కు నియోజకవర్గాల్లో పర్యటించి ఎంతో మందిని కలుసుకున్నారని, అంత కసరత్తు చేసిన తర్వాత ఆయన రూపొందించిన వ్యూహం కాంగ్రెస్‌-ఎస్పీ ఉపయోగించుకోలేద‌ని చెప్తున్నారు. సీట్ల కేటాయింపు, అభ్య‌ర్థుల ప్ర‌చారం విష‌యంలో త‌మ టీం మాట‌లు విన‌లేద‌ని కిశోర్ బృంద స‌భ్యులు చెప్తున్నారు.

మ‌రోవైపు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై  ప్రశాంత్ కిశోర్ స్పందించారు. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చిందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఆప్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారని ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరిందర్ సింగ్‌ను అభినందించారు. ఈ అద్భుత విజయం పంజాబ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల వల్ల సాధ్యమైందని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News