వాటే ఆలోచన యోగి.. పంద్రాగస్టు సెలవు రద్దు చేసిన యూపీ సర్కార్

Update: 2022-07-16 04:02 GMT
వినూత్నంగా ఆలోచించటం.. అందరి ఆమోదాన్ని పొందేలే నిర్ణయాలు తీసుకోవటం పాలకులకు అంత తేలికైన విషయం కాదు. అందులోనూ.. బాగా అలవాటైన అంశాల విషయాల్లో.. రోటీన్ కు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటం కత్తి మీద సామే. అయితే..

అలాంటి వాటి విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతుంటాయి. తాజాగా అలాంటిదే మరొకటి తీసుకున్నారు. ఆగస్టు 15 అన్నంతనే.. క్యాలెండర్లోని మిగిలిన రోజులకు ప్రత్యేక దినమైన ఈ రోజును భారతీయులు ఒకలాంటి భావోద్వేగంతో జరుపుకోవటం తెలిసిందే.

పంద్రాగస్ట్ అన్నంతనే స్కూళ్లకు..కాలేజీలకు.. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించటం ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే.. ఈసారి పంద్రాగస్ట్ కు మాత్రం అలాంటి సెలవును రద్దు చేస్తూ యోగి సర్కారు నిర్ణయం తీసుకుంది. అదేం లెక్క అన్నంతనే.. యోగి సర్కారు చెబుతున్న కారణం విన్నంతనే.. నిజమే కదా? మిగిలిన రాష్ట్రాలు సైతం ఇదే తరహా ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంతకీ.. పంద్రాగస్టు వేళ.. స్కూళ్లకు.. విద్యా సంస్థలకు ఇచ్చే సెలవును రద్దు చేస్తూ యోగి సర్కారు నిర్ణయం ఎందుకు తీసుకుందన్న విషయానికి వస్తే.. 'దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ.. ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించేందుకు సెలవుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక వేడుకల్ని నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఆ రోజున స్వచ్ఛ భారత్ లో భాగంగా యూపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు' అని చెబుతున్నారు.

పంద్రాగస్ట్ వేళ సెలవు ఇచ్చే కన్నా.. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించటాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. యోగి సర్కారు నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు యోగిని ఫాలో అవుతారో? లేదో? చూడాలి. మొత్తంగా చూస్తే.. స్వాతంత్య్ర దినోత్సవాల్ని మొక్కుబడితో కాకుండా అందరిని వేడుకల్లో భాగస్వామ్యం చేసేలా ఉన్న యోగి నిర్ణయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News