తండ్రీకొడుకులు చీలిపోతే యూపీ ఎవరిదంటే..?

Update: 2017-01-04 06:26 GMT
ఉత్తరప్రదేశ్ అధికారపక్షంలోని చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సమాజ్ వాదీ పార్టీలో మొత్తం తన హవానే సాగాలన్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ స్పష్టం చేయటం.. ఇంతకాలం సమాజ్ వాదీ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ములాయంకు ఇది ఏమాత్రంనచ్చని పరిస్థితి. కొడుకు అధిపత్యానికి తండ్రి సానుకూలంగా లేకపోవటంతో సమాజ్ వాదీ పార్టీ నిట్టనిలువుగా చీలిపోయే ప్రమాదంలో ఉంది. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే వేళ.. తాజా పరిణామాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న ఇంటి పోరు పుణ్యమా అని ఆ పార్టీ చీలిపోయిన పక్షంలో.. అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి లాభంగా మారతాయన్న అంశంపై ప్రముఖ మీడియా సంస్థలు ఏబీపీ – లోక్ నీతి ఒక సర్వేను నిర్వహించింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందు విడుదల చేసిన ఈ ప్రీ పోల్ సర్వేలో వెల్లడైన అంశాల్ని చూస్తే..

= అంతర్గతంగా ఎన్ని లుకలుకలు ఉన్నప్పటికీ ఎస్పీ ఇప్పుడున్నట్లుగానే ఎన్నికల బరిలోకి దిగితే.. ఆ పార్టీనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించే వీలుంది.

= మొత్తం 404 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్పీ చీలిక లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి 141 నుంచి 151 సీట్లు చేజిక్కించుకునే వీలుంది.

= ఎస్పీ తర్వాత అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించే వీలుంది. ఆ పార్టీకి 129 నుంచి 130సీట్లు సొంతం చేసుకునే వీలుంది.

= బీఎస్పీకి 93 నుంచి 103.. కాంగ్రెస్ కు 13 నుంచి 19 సీట్లు మాత్రమే దక్కే వీలుంది.

= ఒకవేళ సమాజ్ వాదీ పార్టీ మాత్రం చీలితే  బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించటం ఖాయం. ఆ పార్టీకి 158 నుంచి 168 స్థానాలు దక్కే వీలుంది.

= ఎస్పీ చీలిక తర్వాత అఖిలేశ్ కూటమికి 82 నుంచి 92 సీట్లు.. ములాయంకు 9 నుంచి 15 సీట్లకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.

= ఎస్పీ చీలిన నేపథ్యంలో బీఎస్పీ కొంతమేర లాభపడే వీలుంది. ఆ పార్టీకి 110 నుంచి 120 సీట్లు వచ్చే వీలుంది.

= ఇక.. కాంగ్రెస్ కు 14 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది.

= ఒకవేళ అఖిలేశ్ కానీ కాంగ్రెస్ తో జట్టు కడితే.. ఆ కూటమికి 133 నుంచి 143 స్థానాలు దక్కే వీలుంది. అదే సమయంలో ములాయం వర్గానికి 2 నుంచి 8స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.  ఇక.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి 138 నుంచి 148 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక.. బీఎస్పీకి మాత్రం105 నుంచి 115 సీట్లు వస్తాయని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News