మోడీ గాలి తీసిన మెగా కోడలు

Update: 2019-10-20 06:17 GMT
ప్రతి సంవత్సరం కేంద్రమంత్రి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు.. లేదా రైల్వే మంత్రి తన శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు.. మనకేం దక్కుతుందా అని ఆశగా చూడటం - నిరాశ పడటం.. ఎన్నో ఏళ్లుగా ఇదే వరస. బడ్జెట్లలో కేటాయింపుల పరంగా పక్షపాతం చూపించడం.. ఉత్తరాదికి పెద్ద పీట వేసి - దక్షిణాదిని చిన్న చూపు చూడటం మామూలు వ్యవహారం అయిపోయింది. రాష్ట్రాల వాటాగా న్యాయంగా దక్కాల్సిన నిధుల్ని కూడా సరిగా అందజేయక దక్షిణాది రాష్ట్రాల్ని చిన్న చూపు చూడటాన్ని గమనిస్తున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కారు ఈ విషయంలో స్పష్టమైన పక్షపాతం ప్రదర్శిస్తోంది. ఐతే కనీసం కళలకు సంబంధించిన విషయాల్లో అయినా మన ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కుతుందా అంటే అదీ లేదాయె. అందుకు నిన్న నరేంద్ర మోడీ సినీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశం నిదర్శనం.

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా స్వచ్ఛ భారత్ ఇతర కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఆయన సినీ పరిశ్రమతో కలిసి పని చేసేందుకు ఢిల్లీలో శుక్రవారం ఒక కార్యక్రమం నిర్వహించారు ప్రధాని మోడీ. ఐతే అందులో ఒక్క సౌత్ సెలబ్రెటీ కూడా లేడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు - రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల.. మోడీని ఈ విషయమై సూటిగా ప్రశ్నించింది. దక్షిణాది వాళ్లు మోడీని ఆరాధిస్తారని.. ప్రధానిగా ఆయన్ని చూసి గర్విస్తారని.. ఐతే ఆయన మాత్రం నిన్నటి సమావేశంలో దక్షిణాది వారికి చోటే ఇవ్వకుండా కేవలం హిందీ ఆర్టిస్టులకే పరిమితం చేయడం ఎంత వరకు సమంజసమని ఉపాసన ప్రశ్నించింది. ఇది తాను ఎంతో బాధతో అంటున్న మాటలని.. వీటిని సరైన స్ఫూర్తితో తీసుకోవాలని ఉపాసన అంది. ఈ ట్వీట్‌ కు సోషల్ మీడియా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దక్షిణాది వారు మోడీ తీరును దుయ్యబడుతూ.. ఉపాసనకు మద్దతు పలికారు.


Tags:    

Similar News