అయినా... మౌనమేనా గంటా...?

Update: 2022-05-11 06:15 GMT
ఆయన దిగ్గజ నాయకుడు. టీడీపీలో సీనియర్ మోస్ట్ నేత. తనకు తానే చెప్పుకున్నట్లుగా నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రి, ఒకసారి ఎంపీ చేసిన మేటి నాయకుడు. ఆయన విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు. మరి గంటా మూడేళ్ళుగా ఎక్కడా పెద్దగా  సౌండ్ చేయడం లేదు. అపుడపుడు ప్రకటనలు చేస్తూ ఏదో ఒకటి  మాట్లాడడం తప్ప ఆయన ఎందుకో పూర్తిగా మౌనముద్ర లోనే ఉంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే తన సొంత వియ్యంకుడు, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన నారాయణ అరెస్ట్ అయినా సరే గంటా మాత్రం ఫుల్ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు. నారాయణ కుమార్తె గంటా కోడలు అన్న సంగతి విధితమే. ఇక నారాయణ ఏకైక కుమారుడు అయిదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. సరిగ్గా ఆయన వర్ధంతి వేళ ఇంట్లో కార్యక్రమాలలో  ఉన్న నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక విధంగా ఇది బాధాకరమే. అరెస్ట్ ఎపుడైనా ఎవరిని అయినా చేయవచ్చు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ కొడుకు పోయిన దుఖం ఈనాటికీ తీరక  ఆ విషాదాన  నారాయణ ఉన్నారు. అది కూడా కొడుకు  డెత్ యానివర్సరీ వేళ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడంతో టీడీపీలో దిగువ స్థాయి నుంచి చంద్రబాబు దాకా అంతా టోటల్ గా ఆవేశాన  ఊగిపోయారు.

ఇదేమి అరెస్ట్, ఇది పూర్తి కక్ష రాజకీయం అని కూడా మండిపడ్డారు. ఏ ఒక్క నేత మినహాయింపు లేకుండా జగన్ సర్కార్ ని గట్టిగా తగులుకున్నారు. ఒక విధంగా చీల్చిచెండాడారు. మరి ఇంతలా జరిగితే ఆయన సొంత వియ్యకుండు గంటా మాత్రం సింగిల్ కామెంట్ కూడా పెట్టకపోవడం ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది.

నిజానికి గంటా కూడా టీడీపీలోనే ఉన్నారు. మిగిలిన వారు అయితే ఓకే అనుకోవచ్చు. తన బంధువు, మాజీ మంత్రి, దానికి మించి నారాయణ విద్యా సంస్థల అధినేత అరెస్ట్ అయితే ఖండించకపోవడం పట్ల మాత్రం చర్చ సొంత పార్టీలోనూ బయట కూడా సాగుతోంది.

అయితే గంటా తీరు తెలిసిన వారు మాత్రం ఆయన రాజకీయం ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఆయన ఎపుడు మాట్లాడాలి, ఎపుడు మాట్లాడకూడదు అన్నీ చూసుకుంటారు అని కూడా అంటారు. ఇక గంటా మూడేళ్ళుగా టీడీపీలో ఉన్నా  ఆయన ఇపుడు ఎమ్మెల్యే అవునో కాదో కూడా తెలియదు. ఎందుకంటే  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా రెండేళ్ల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

అది ఇపుడు స్పీకర్ కోర్టులో ఉంది. ఇక ఆయన టీడీపీతో సంబంధాలు ఏ మేరకు కొనసాగిస్తున్నారు అంటే దాని మీద చర్చ ఉంది. ఈ మధ్య చంద్రబాబు విశాఖలో పార్టీ మీటింగ్ పెడితే గంటా హాజరు కాలేదు. మరి ఆయన ఏం చేస్తారు, రాజకీయ వ్యూహం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

ఆ మధ్య దాకా గంటా కాపు నేతలతో సమావేశాలు పెట్టి హల్ చల్ చేశారు. కొన్నాళ్ళు జనసేనలోకి వెళ్తారు అని అన్నారు. ఇపుడు టీడీపీ మళ్లీ పుంజుకుంటోంది కాబట్టి అందులోనే కొనసాగుతారు అని అంటున్నారు. ఆ మధ్యన అయితే వైసీపీలోకి వెళ్తారు అని కూడా వినిపించింది. సరే ఆయన రాజకీయాలు ఆయన ఇష్టం. ఏది ఏమైనా సొంత వియ్యంకుడు  అరెస్ట్ మీద గంటా రియాక్ట్ కాకపోవడం పట్ల మాత్రం చర్చ అయితే ఉంది. మరి మౌనముద్రలో ఉన్న గంటా ఎపుడు పెదవి విప్పుతారో చూడాలి.
Tags:    

Similar News