నిజమేనా : సగం మంది ఇంటికేనట...?

Update: 2022-05-26 16:30 GMT
ఏపీలో ఎన్నికలు ఇంకా రెండేళ్ల వ్యవధిలో ఉండగానే సర్వేల పేరిట హల్ చల్ చేస్తున్నాయి కొన్ని సంస్థలు. ఆ సర్వేలు చూస్తే అధికార వైసీపీ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అంటున్నారు. ఆత్మ సాక్షి సర్వే అంటూ ఒకటి ఈ మధ్య బయటకు వచ్చింది. ఈ సర్వే చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఏపీలో వైసీపీ బలం సగానికి సగం తగ్గిపోయిందని. అంటే మొత్తం 151 సీట్లలో 77 సీట్లు ఈసారి వస్తాయని తేల్చింది. అది కూడా ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే అన్న మాట.

అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు  రావడానికి కూడా వైసీపీ ఆమడ దూరంలో ఉంది అని అంటున్నారు. ఇక మరో వైపు చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా అన్ని చోట్లా ప్రజా వ్యతిరేకత ఉందని ఈ సర్వే చెబుతోంది. దాంతో ప్రస్తుత మంత్రివర్గంలో కూడా అరడజన్ కి పైగా మంత్రులు ఓడిపోయే చాన్స్ ఉందని కూడా చెబుతోంది.

అలాగే మాజీ మంత్రులలో కూడా చాలా మంది ఓటమి అంచున ఉన్నారని అంటోంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది సీట్లలో కేవలం రెండు నుంచి మూడు మాత్రమే ఈసారి వైసీపీ గెలుచుకోగలుతుందని అంటున్నారు. మరో మూడు చోట్ల టఫ్ కాంపిటేషన్ ఉందని, మరో నాలుగు సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందని అంటున్నారు.

ఇక విజయనగరం జిల్లాలో కూడా ఈసారి టీడీపీ బాగానే పుంజుకుంది అని సర్వే చెబుతోంది. విశాఖలో కూడా సీని మారుతోందని చెబుతున్నారు.  మొత్తంగా చూస్తే ఉత్తరాంధ్రా ఈసారి గణనీయంగా  సీట్లను టీడీపీ గెలుచుకోబోతూంటే  ఆ మేరకు వైసీపీకి  భారీగా తగ్గుతాయని అంటున్నారు.

అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్న అయిదు ఎంపీ సీట్లలో ఒక్క శ్రీకాకుళం తప్ప మిగిలిన నాలిగింటా సిట్టింగులకు ఓటమి భయం తప్పదని తేల్చేసింది. అంటే ఆ నాలుగు సీట్లూ కూడా వైసీపీవే కావడంతో ఈసారి అధికార పార్టీకి గట్టి దెబ్బ పడిపోతోంది అనే అంటున్నారు.

అలాగే ఏపీలో చూసుకుంటే వైసీపీకి ఉన్న 22 ఎంపీలలో సగానికి సగం మంది ఈసారి ఓటమికి దగ్గరగా ఉన్నారని కూడా సర్వే తేల్చేసింది. మొత్తానికి ఈ సర్వే మాత్రం ఆసక్తికరంగానే ఉందని అంటున్నారు. ఈ సర్వే ఫలితాలను ఇపుడు వైసీపీతో పాటు టీడీపీ వారు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే ఇలా సీన్ ఉంటే మరో రెండేళ్లలో ఎన్నికలు అంటే కచ్చితంగా వైసీపీ మరిన్ని సీట్లు కోల్పోతుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News