ప‌నిలేని ప‌ద‌వులు.. వైసీపీలో నేత‌ల గ‌రంగ‌రం

Update: 2022-07-23 23:30 GMT
వైసీపీ అధినేత జ‌గ‌న్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ఏదో ఒరగబెడతారని పలువురు నాయకులు వైసీపీ గెలుపు కోసం రెండేళ్లపాటు కష్టపడ్డారు. జగన్ సీఎంగా సంత‌కం చేసిన  రోజు నుంచి తమ కష్టాన్ని గుర్తించి ఏదో ఒక పదవి కట్టబెడతారని, తాము కూడా అధికారాన్ని, హోదాను అనుభవించవచ్చని కలలు కన్నారు. అదే ఆశతో రెండున్నరేళ్లు ఎదురుచూశారు. ఎట్టకేలకు కొన్ని నెలల కింద‌ట జ‌గ‌న్‌ నామినేటెడ్‌ పదవులు భర్తీ చేశారు. దీంతో నాయ‌కులు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

త‌మ‌కు ప‌ద‌వులు ఇచ్చారంటూ.. జ‌గ‌న్‌కు అప్ప‌ట్లో పాలాభిషేకాలు సైతం చేశారు. అయితే.. నెల‌లు గ‌డు స్తున్న కొద్దీ.. ప‌ద‌వుల్లో ప‌స‌లేద‌ని.. అధికారం అంత‌క‌న్నాలేద‌ని.. అస‌లు ప‌నే లేద‌ని.. తెలిసి.. ఇప్పుడు ఈసురోమంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు రెడ్డి వ‌ర్గానికి కంచుకోట వంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఈ జిల్లా పరిధిలో పలువురు నాయకులకు భారీగానే పదవులు పంచిపెట్టారు. ఈ పంపకాలు చూసిన ప్రజలు,  నాయకులు నెల్లూరు జిల్లాకు మంచి న్యాయమే చేశారని భావించారు.

తీరా పదవులు పొందిన నేతలను ఇప్పుడు పలకరిస్తే ఆనందం కంటే విరక్తే ఎక్కువ కనిపిస్తోంది. గూడూరు డివిజనలోని ఓ నాయకుడికి రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన చైర్మన్‌ పదవిని ఇచ్చారు. కానీ ఏం లాభం. ఇప్పటివరకు ఆయన బాధ్యతలే తీసుకోలేదు. కారణం..  ఆ కార్పొరేషన ఆవిర్భావమే జరగలేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన జరగలేదు. కానీ పదవులు పంచామంటే పంచామని అనిపించుకోవడం కోసం జిల్లాకు చెందిన ఆ నాయకుడిని చైర్మనగా నియమించారు.

ఇక‌, గూడూరు డివిజనకు చెందిన మ‌రోనేత‌.. ప్రముఖ రాజకీయ కుటుంబానికి రాజకీయ వారసుడు. ఎన్నో ఆశలతో జగన పక్షం చేరారు. పార్టీకి ఎంతో విశ్వాసంగా ఉన్నారు. ఈయనకు గొప్ప పదవే దక్కుతుందని అంతా అనుకున్నారు. రాష్ట్ర కార్పొరేషన్‌ పదవి దక్కాక ఆయన అనుచరులు సంబరాల్లో మునిగి తేలారు. కానీ ఇప్పటివరకు ఆ పదవికి సంబంధించిన విధులు ఏమిటో తెలియలేదు. ఏమైనా చేయాలన్నా నిధులు కూడా లేవు.

ఇలా.. ఒక్క నెల్లూరులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అంతే. విధులు, నిధులు లేవు.  ఇక కుల కార్పొరేష‌న్‌ చైర్మన్ల పరిస్థితిని గ‌మ‌నిస్తే.. వీరికి పదవి ట్యాగ్‌ తప్ప కూర్చోవడానికి కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదు. ముదిరాజ్‌ కార్పొరేషన్‌, జంగమ,  సంచార జాతుల కార్పొరేషన్లకు ఆయా సామాజిక వ‌ర్గాల నాయకులను చైర్మన్లుగా నియమించారు. పదవి దక్కిందన్న ఆనందం తప్ప వీరికి కనీస గౌరవం కూడా దక్కడం లేదు.

పదవులు కాగితాల మీద ఉన్నాయి తప్ప మరెక్కడా వీటి ఉనికి కనిపించడం లేదు. రాజధానిలో వీటికి ఒక కార్యాలయం కానీ, చైర్మన్లకు ఒక గది కానీ లేదు. ఇదే విషయాన్ని వీరు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళితే.. పదవులు ఇచ్చాం కదా.. సర్దుకోండి. నిధులు వచ్చినప్పుడు కార్పొరేషనలకు కార్యాలయాలు, మీకు కుర్చీలు.. ఇస్తామని అంటున్నారట‌. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News